ఆస్తుల అమ్మకాలపై టీటీడీ వెనక్కి తగ్గిన జగన్ సర్కార్!
Send us your feedback to audioarticles@vaarta.com
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల శ్రీవారి సన్నిధికి చెందిన నిరర్ధక భూములను అమ్మేయాలని టీటీడీ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నిర్ణయాన్ని గతంలో అధికారంలో ఉండి భారీగా వెంకన్న ఆస్తులను అమ్ముకున్న టీడీపీ సైతం వ్యతిరేకిస్తోందని వైసీపీ తీవ్రంగా తప్పుబడుతోంది. మీడియా గొట్టాల ముందుకొచ్చి అధికార పార్టీ, టీటీడీ చైర్మన్‌పై తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. టీడీపీ కూడా ఈ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా గత ప్రభుత్వం హయాంలో ఇలాగే అమ్మకాలు జరిగినప్పుడు ప్రస్తుత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను సైతం తెరపైకి తెచ్చి హడావుడి చేస్తోంది. ఈ వ్యవహారంపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ క్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా.. ‘అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తోందేం’ అంటూ గతంలో టీడీపీ అమ్మిన భూముల లెక్కలను వివరిస్తూ మరి కౌంటర్ల వర్షం కురిపిస్తోంది.
అటు.. ఇటు అంతా వ్యతిరేకతే..
ఇంతవరకూ అంతా ఓకేగానీ.. ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఈ నిర్ణయం సొంత టీటీడీ బోర్డ్ మెంబర్స్‌లోని కొందరి నుంచి అలాగే అధికార పార్టీరి పలువురు వైసీపీ నేతలు.. ముఖ్యంగా ఎంపీ రఘురామ కృష్ణం రాజు నుంచి, పలువురు పీఠాధిపతులు, స్వామీజీల నుంచి తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయి. దీంతో ఈ అమ్మకాల వ్యవహారంపై టీటీడీ, జగన్ సర్కార్ ఎలా ముందుకెళ్తుంది..? అసలు టీటీడీ ఏం చేయబోతోంది..? అనుకున్నట్లుగానే మొండిగా ముందుకెళ్తుందా..? లేకుంటే వెనక్కి తగ్గుతుందా..? అనేదానిపై ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చే జరుగుతోంది. ఈ వ్యవహారంపై ఎవరేమన్నారు..? సొంత పార్టీ నేతలు, టీటీడీ పాలమండలి సభ్యులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ రియాక్ట్ అవుతున్నారు. ఇలా ప్రతిపక్షం.. సొంతిట వ్యతిరేకత రావడంతో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
నిలుపుదల..
వివాదాస్పదంగా మారిన భూముల వ్యవహారంపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ భూముల అమ్మకాల ప్రక్రియను నిలుపుదల చేస్తున్నట్లు సోమవారం నాడు సర్కార్ ప్రకటించింది. 2016 జనవరి 30 టీటీడీ బోర్డు తీర్మానాన్ని నిలుపుదల చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. 2016 జనవరి 30న చేసిన తీర్మానంలో 50 చోట్ల భూములను అమ్మాలని నాటి బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని టీటీడీ బోర్డుకు ప్రభుత్వం సూచించింది. ఆథ్యాత్మిక వేత్తలు, ధర్మ ప్రచారకులతో సంప్రదింపులు జరపాలని ఉత్వర్వుల్లో నిశితంగా పేర్కొంది. సంప్రదింపుల ప్రక్రియ పూర్తయ్యే వరకూ భూముల వేలం ప్రక్రియ ఆపాలని ఉత్వర్వులు జారీ చేయడం జరిగింది. ఆస్తులను దేవాలయాల నిర్మాణం, ధర్మ ప్రచారం, ఆథ్యాత్మిక కార్యక్రమాలకు వినియోగించే అంశంపై పరిశీలించాలని టీటీడీ బోర్డుకు ప్రభుత్వం సూచించింది. మరి తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పాలకమండలి సభ్యులు ఇలా..
ఈ అమ్మకాలపై ప్రస్తుత పాలకమండలి సభ్యుల నుంచే అభ్యంతరాలు వ్యక్తమవ్వడం గమనార్హం. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాలపై పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న రాకేష్ సిన్హా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి లేఖ రాసి.. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని చెప్పి.. ఇప్పుడు ఆస్తుల అమ్మకాలకు పూనుకోవటం తగదని తప్పుబట్టారు. తక్షణమే ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకుని, ఆస్తుల అమ్మకం ప్రక్రియను నిలిపివేయాలని లేఖ రూపంలో ఆయన డిమాండ్ చేశారు. అంతటితో ఆగని ఆయన.. శ్రీవారికి భక్తి శ్రద్ధలతో సమర్పించిన ఆస్తుల వెనుక ఉండే సెంటిమెంట్‌ను గౌరవించాలని పరోక్షంగా చురకలు అంటించారు. ఇలా పాలకమండలి సభ్యుడి నుంచి వ్యతిరేకత రావడంతో టీటీడీ ఆలోచనలో పడింది.
సొంత పార్టీ నేతల నుంచి..
ఈ అమ్మకాలపై పలువురు వైసీపీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకతే వస్తోంది. కొందరు డేర్ చేసి మీడియా ముందుకు రాగా.. ఇంకొందరు మాత్రం సన్నిహితులతో పంచుకుని చేసేదేమీ లేక మిన్నకుండిపోతున్నారు. తాజాగా.. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అలియాస్ రఘురాజు మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న తిరుమల వెంకన్న ఆస్తులను విక్రయించాలని టీటీడీ నిర్ణయం తీసుకోవడం సబబు కాదని.. దీనిపై తాను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేయాల్సింది పోయి.. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదని.. టీటీడీపై విమర్శలు గుప్పించారు. దేవుడి పేరిట ఉన్న ఆస్తులను అమ్మడం ద్వారా ఆ దేవుడికి టీటీడీ ద్రోహం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ తన నిర్ణయం ద్వారా భూములు విరాళంగా ఇచ్చిన దాతల మనోభావాలను దెబ్బతీస్తోందన్నారు. దాతలు ఎంతో భక్తితో ఆస్తులు సమర్పిస్తారని, ఆ ఆస్తులను పరిరక్షించాలే కానీ, విక్రయించడం సబబు కాదని.. ఈ విషయంపై టీటీడీ మరోసారి పునరాలోచన చేసుకోవాలని ఎంపీ సూచించారు. రఘురామ కృష్ణంరాజు హితవు పలికారు. కాగా.. తాను ఈ విషయంపై త్వరలోనే సీఎం వైఎస్ జగన్ రెడ్డిని కలిసి ఈ విషయంపై నిశితంగా చర్చిస్తానన్నారు.
వాట్ నెక్స్ట్..!
ఇలా నేతలే కాకుండా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కూడా స్పందించి ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. దేవాదాయశాఖ మంత్రి, టీటీడీ చైర్మన్‌తో మాట్లాడిన ఆయన.. ఈ వ్యవహారంలో వివాదాలకు తావు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని.. టీటీడీ తీసుకునే ప్రతి నిర్ణయం భక్తుల మనోభావాలకు ముడిపడి ఉంటుందని సూచించారు. భక్తుల మనోభావాలను గౌరవించేలా నిర్ణయం తీసుకోవడం మంచిదన్నారు. మొత్తానికి చూస్తే.. టీటీడీ నిర్ణయంపై జగన్ సర్కార్ స్పందించి నిలుపుదల చేసింది. ఇది ప్రస్తుతానికి మాత్రమే. మరి రానున్న రోజుల్లో పరిస్థితేంటి..? ఇప్పుడు హడావుడి జరుగుతోంది గనుక ఇలా చేసిందన్నది జగమెరిగిన సత్యమే. మరి తదుపరి ఏం చేయనుంది..? దీనిపై ఎలా ముందుకెళ్లనుంది..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com