జూన్ 7న ఏపీ మంత్రివర్గ విస్తరణ.. అదృష్టవంతులెవరో!
- IndiaGlitz, [Wednesday,May 29 2019]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భారీ మెజార్టీ సీట్లు దక్కించుకున్న వైసీపీ.. రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఏపీకి నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే రేపు జగన్ ఒక్కరే ప్రమాణం చేస్తుండటంతో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుంది..? మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు ఉంటుంది..? జగన్ ఎవరెవర్ని కేబినెట్‌లోకి తీసుకోబోతున్నారు..? జగన్ కేబినెట్‌లో పనిచేసే అదృష్టవంతులు ఎవరు..? ఇలా పలురకాల ప్రశ్నలు జనాల్లో వస్తున్నాయి. అయితే వీటన్నింటికీ చెక్ పెడుతూ జగన్ మంత్రివర్గ విస్తరణకు తేదీ ఖరారు చేసేశారు.
జూన్-7న మంత్రివర్గ విస్తరణ..
జగన్ ప్రమాణ స్వీకారం చేసిన వారానికి అనగా.. జూన్ 7న మంత్రివర్గ విస్తరణను చేపట్టేందుకు ముహూర్తం ఖరారు చేసేశారు. మంత్రివర్గం ఆమోదంతోనే శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు వైఎస్ జగన్ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా.. శాసనసభ నిర్వహణ విషయమై సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంతో అసెంబ్లీ అధికారులు నిశితంగా చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూన్ 11, 12 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని సమాచారం. ఈ సమావేశాల్లో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారాలు ఉంటాయని.. అదే విధంగా జూన్ నెలాఖరులో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
జూన్ 3నుంచి సమీక్షలు ప్రారంభం..
ఇదిలా ఉంటే.. సరిగ్గా జగన్ సీఎంగా ప్రమాణం చేసిన మూడ్రోజుల్లో శాఖల వారిగా అధికారులతో సమీక్షలు నిర్వహించబోతున్నారు. ఈ సమావేశాలు ఏపీ సచివాలయంలోనే జరగనున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లను వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి దగ్గరుండి పరిశీలించారు. కాగా.. జగన్ కోసం సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని సీఎం కార్యాలయం సిద్ధమవుతోంది. సీఎం చాంబర్‌ను సరికొత్తగా ముస్తాబు చేయడం జరిగింది. క్యాబినెట్ హాల్, హెలిపాడ్‌లతో పాటు సీఎం నేమ్ ప్లేట్‌ను కూడా సుబ్బారెడ్డి పర్యవేక్షించారు. సీఎం చాంబర్‌లో మార్పులు చేర్పులు, సీఎం నేమ్ ప్లేట్ తీరుతెన్నులను ఆయన పరిశీలించారు. వైవీ ఆమోదించిన తర్వాతే పలు మార్పులను ఖరారు చేశారు.