Ymca Beach:విశాఖ బీచ్‌కు కొట్టుకొచ్చిన పురాతన పెట్టే.. చూసేందుకు ఎగబడ్డ జనం, అందులో ఏముంది..?
- IndiaGlitz, [Saturday,September 30 2023]
విశాఖలోని వైఎంసీఏ బీచ్ తీరానికి ఓ భారీ చెక్క పెట్టే కొట్టుకురావడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. శుక్రవారాత్రి కొందరు పర్యాటకులు, మత్స్యకారులు ఈ పెట్టెను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు దానిని పరిశీలించి పురాతనమైనదిగా గుర్తించారు. అనంతరం భారీ బరువున్న ఈ పెట్టెను ప్రొక్లెయిన్ సాయంతో ఒడ్డుకు చేర్చారు. అలాగే రాత్రంతా ఈ పెట్టెకు పోలీసులు కాపలాగా వున్నారు.
శనివారం పొద్దున్న ఈ వార్త స్థానికులకు తెలియడంతో దానిని చూసేందుకు స్థానికులు, చుట్టుపక్కల ప్రాంతాల వారు వచ్చారు. వారిని కట్టడి చేయడానికి పోలీసులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ పెట్టె బ్రిటీష్ కాలం నాటిగా భావిస్తున్నారు. దీనిపై ఆర్కియాలజీ విభాగానికి పోలీసులు సమాచారం అందించారు. ఇప్పుడు ఆ పెట్టెలో ఏముందనే దానిపై స్థానికులు కథకథలుగా చెప్పుకుంటున్నారు. ఆర్కియాలజీ విభాగం దానిని తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
అయితే విశాఖ తీరానికి ఇలాంటి వస్తువులు కొట్టుకురావడం ఇదే తొలిసారి కాదు. అలాగే ఆర్కే బీచ్‌లో బ్రిటీష్ కాలం నాటి బంకర్లు సైతం బయటపడ్డాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో శత్రవులపై దాడి కోసం నిర్మించిన పలు బంకర్లు విశాఖ తీరంలో వున్నాయి. ఇటీవల జాలరిపేట పాండురంగ స్వామి ఆలయం సమీపంలో ఓ బంకర్ బయటపడింది. తాజాగా ఇప్పుడు తీరానికి ఓ భారీ పెట్టే కొట్టుకురావడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది.