మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ హీరోయిన్‌గా యాంకర్!

  • IndiaGlitz, [Monday,February 17 2020]

సినిమా రంగానికి మూడేళ్లుగా దూరంగా ఉన్న మంచు మనోజ్ ఎట్టకేల‌కు తాజగా ‘అహం బ్రహ్మాస్మి’ అనే చిత్రాన్ని ప్రకటించారు. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. కాగా.. ఈ సినిమాతో హీరోగానే కాదు.. నిర్మాత‌గా కూడా మారారు. కొన్ని రోజుల క్రితమే తాను నిర్మాత‌గా మారుతున్నాన‌ని ఆయ‌న ప్రక‌టించిన సంగ‌తి తెలిసిందే. ఎంఎం ఆర్ట్స్ అనే బ్యాన‌ర్‌ను కూడా అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా విడుద‌ల చేయ‌డానికి మ‌నోజ్ స‌న్నాహాలు చేస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, క‌న్నడ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో సినిమా విడుద‌ల‌వుతుంది. అయితే ఇంతవరకూ సినిమాకు సంబంధించి కొత్త విషయాలేమీ రాకపోగా.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పుకారు షికారు చేస్తోంది.

ఇంతకీ ఎవరా బ్యూటీ!?

అదేమిటంటే.. మనోజ్ సరసన ఈ సినిమాలో ఓ ప్రముఖ యాంకర్ నటిస్తోందన్నదే ఆ పుకారు సారాంశం. ప్రముఖ యాంకర్ అంటే తెలుగు ఇండస్ట్రీకి చెందిన యాంకర్ అనుకుంటే తప్పులే కాలేసినట్లే.. మన యాంకర్ కాదండోయ్.. తమిళ యాంకర్ అట. ప్రియా భవానీ శంకర్ అనే యాంకర్‌కు తమిళ్‌లో మంచి గుర్తింపు ఉంది. ఇప్పటికే తమిళ్ సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్‌గా అలా చిన్న చిన్న పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా వస్తున్న ‘భాతీయుడు 2’ లో కూడా ఓ పాత్రను చేస్తోంది.

కలిసొచ్చేనా..!?

అయితే టాలీవుడ్‌కు మాత్రం మనోజ్ చిత్రం ద్వారా పరిచయం కాబోతోంది. వాస్తవానికి కొత్త హీరోయిన్లను పరిచయం చేయడంలో మంచు వారబ్బాయి ముందు వరుసలో ఉంటారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే తన చిత్రాల ద్వారా కొత్త కొత్త బ్యూటీలకు లైఫ్ ఇచ్చారు. వారిలో తమన్నా కూడా ఒక్కరు. ‘శ్రీ’ సినిమా ద్వారా పరిచయం చేసిన మిల్క్ బ్యూటీ తమన్నా స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్తోంది. అయితే తాజాగా పరిచయం అవుతున్న ప్రియా భవానీ శంకర్‌కు మంచు సినిమా ఏ మాత్రం కలిసొస్తుందో వేచి చూడాల్సిందే మరి. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.