కేసీఆర్ సార్ థ్యాంక్యూ.. ఇండస్ట్రీకి గొప్ప వార్త : అనసూయ

  • IndiaGlitz, [Wednesday,June 10 2020]

తెలంగాణలో సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్‌లకు సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అలాగే మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేసింది. లాక్ డౌన్ నిబంధనలను అనుసరిస్తూ షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాగా మొత్తం ఆర్టిస్టుల బాధ్యత నిర్మాతలదేనని మార్గదర్శకాల్లో కేసీఆర్ సర్కార్ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి పలు నిబంధనలను సైతం కేసీఆర్ సర్కార్ విడుదల చేసింది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు.. సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

ఇండస్ట్రీకి ఇది గొప్పవార్త

యాంకర్ కమ్ నటి అనసూయ స్పందిస్తూ థ్యాంక్స్ కేసీఆర్ సార్ అంటూ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. ‘మా పనులు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. థ్యాంక్యూ కేసీఆర్‌ సార్‌.. అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సర్ గారికి కూడా థ్యాంక్స్. మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పని చేస్తామని హామీ ఇస్తున్నాం. సినీ పరిశ్రమలో అన్ని స్థాయిల్లో ఉన్న వారికి ఇది చాలా గొప్ప వార్త. ఎంటర్టైన్‌మెంట్‌ తప్ప మాకు ఇతర ఏ పనీ తెలియదు’ అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు నవ్వుతున్నట్లున్న ఎమోజీని సైతం అనసూయ జతపరిచింది.