సాధారణంగా హారర్ కామెడీల్లో దెయ్యాలు మనుషులను భయపెడుతుంటే, మనుషుల ఎలా భయపడతారనే దానిపై ఇప్పటి వరకు సినిమాలు వచ్చాయి. కానీ రొటీన్‌కు బిన్నంగా దర్శకుడు మహి మనుషులే దెయ్యాలను భయపెడితే అనే కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించాడు. ఇంతకు మనుషులు దెయ్యాలను ఎందుకు భయపెడతారో, అసలు ఎలా భయపెడతారో, దర్శకుడు ఈ రివర్స్ ఎలిమెంట్‌ను ఎలా తెరకెక్కించాడనే పాయింట్‌తో పాటు తాప్సీ, శ్రీనివాసరెడ్ది, షకలక శంకర్, వెన్నెలకిషోర్, తాగుబోతు రమేష్ లు నటించడం సినిమాపై అంచనాలనే పెంచాయి. మరి సినిమా ప్రేక్షకులను సినిమా ఎలా మెప్పించిందనే విషయం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
కథ:
డెహ్రాడూన్ తీర్థయాత్రలకు వెళ్లిన తల్లిదండ్రులు తప్పిపోయిన వెతుక్కుంటూ రాజు(రాజీవ్ కనకాల) ఇండియా వస్తాడు. ఎంత వెతికినా వారి అచూకీ దొరకదు. ఇక మలేషియాలోనే సెటిలైపోవాలని రాజు నిర్ణయించుకుని వారి తల్లిదండ్రులుండే ఇంటిని అమ్మేయాలనుకుంటారు. అయితే పదికోట్లు విలువ చేసే ఇంటిని కోటి రూపాయలకు కొట్టేయాలని రాజు స్నేహితుడు రాజా రవీందర్ ప్లాన్ చేసి ఇంట్లో దెయ్యాలున్నాయని ప్రచారం కల్పిస్తాడు. దాంట్లో ఇంట్లోకి ఎవరూ రావాలన్నా, భయపడుతుంటారు. మరో వైపు సిద్ధు(శ్రీనివాసరెడ్డి)కి గుండు జబ్బు ఉండి గుండె ఆపరేషన్ కోసం పాతిక లక్షలు డబ్బులు అవసరమవుతాయి. రేచీకటి, చెవిటితనం కారణంగా ఎ.టి.ఎంలో డబ్బులు పోవడానికి కారణమైన సెక్యూరిటీ గార్డు(వెన్నెలకిషోర్) పోలీసుల భారి నుండి తప్పించుకోవాలంటే ఐదు లక్షలు అవసరం అవుతాయి. అలాగే నటుడు కావాలనుకుని ఉన్న షాప్ అమ్మేసి పదిలక్షలు ఇచ్చి మోసపోతాడు షకలక శంకర్. కొడుకు ఆపరేషన్‌కు డబ్బులు అవసరమైన వ్యక్తి తాగుబోతు రమేష్. ఈ నలుగురు కలిసి దెయ్యాలుంటే ఇంట్లో నాలుగు రోజులు ఉండి, దెయ్యాలు లేవని ప్రూవ్ చేస్తామని అంటారు. రాజు అందుకు ఒప్పుకుని అలా చేస్తే కొంత డబ్బుకూడా ఇస్తానని అంటాడు. నలుగరు స్నేహితులు ఇంట్లోకి ప్రవేశిస్తారు. వారికెలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ నలుగురు స్నేహితులు దెయ్యాలనేలా భయపెడతారు? అసలు దెయ్యాలెవరు? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
నటీనటుల పనితీరు:
గంగ సినిమా తర్వాత తాప్సీ నటించిన మరో హారర్ కామెడీ చిత్రమిది. ఇందులో తాప్సీ ఆత్మ క్యారెక్టర్‌లో కనపడింది. గంగ సినిమాలో తాప్పీ చేసిన పాత్రతో పోల్చితే ఈ సినిమాలో తాప్పీ ఫెర్ఫామెన్స్‌కు పెద్ద స్కోప్ లేదు. ఎక్కువ ఆనందం వస్తే ఏడుస్తూ, ఎక్కువ భయమేస్తే నవ్వుతూ మెంటల్ బేలెన్స్ థెరఫీ చేసుకునే పాత్రలో శ్రీనివాసరెడ్డి నటన బావుంది. అంజలి, జయమ్మునిశ్చయమ్మురా సినిమాల తర్వాత శ్రీనివాసరెడ్డి చేసిన లీడ్ పాత్ర ఇది. ఇక చెవిటి, రేచీకటి వంటి అవలక్షణాలుండి భయమేసినప్పుడు దెయ్యముందో లేదో కూడా తెలియకుండా ఫ్లూట్ వాయించే క్యారెక్టర్‌లో వెన్నెలకిషోర్ నటన ఆకట్టుకుంది. రాత్రి 9 అయితే తాగకుండా ఉండలేడు. తాగితే ఏం చేస్తాడో తెలియదు. తనకు అచ్చొచ్చిన పాత్రలో తాగుబోతు రమేష్ అవలీలగా నటించేశాడు. ఇక షకలక శంకర్ స్ల్పిట్ పర్సనాలిటీ ఉన్న పాత్రలో ఇరగదీశాడు. పవన్‌కల్యాణ్, రాందేవ్‌బాబా, కె.ఎ.పాల్ లను షకలక ఇమిటేట్ చేసే కామెడి బిట్ సూపర్బ్‌గా ఉంటుంది. రాజీవ్‌కనకాల, విజయ్ చందర్, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖారామన్ తదితరులు వారి వారి పాత్రల్లో చక్కగా నటించారు.
టెక్నిషియన్స్ పనితీరు:
దర్శకుడు మహి సినిమాను కొత్త పాయింట్‌లో తెరెకెక్కించే ప్రయత్నం చేశాడు. దెయ్యాలకు నవ్వంటే భయం పాయింట్ మీద మనుషులు దెయ్యాలను భయపెట్టే సన్నివేశాలను చక్కగా రాసుకున్నాడు. సినిమాలో ప్రస్తుతం సమాజంలో జరగుతున్న ఎమోషనల్ పాయింటను టచ్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు మహి. అనిష్ తరుణ్‌కుమార్ సినిమాటోగ్రఫీ బావుంది. కె మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పరావాలేదు. శ్రవణ్ ఎడిటింగ్ ఓకే.
సమీక్ష:
తొలి సన్నివేశాన్ని దెయ్యం యాంగిల్‌లో ఓపెన్ చేయడం చాలా బావుంది. కానీ ప్రేక్షకుడికి సీన్ ఎండ్ వరకు అది దెయ్యం యాంగిల్‌లో నడిచే సీన్ అని తెలియదు. తెలియగానే చిన్నపాటి సర్‌ప్రైజ్ ఉంటుంది. దర్శకుడు చెప్పాలనుకున్న ఎమోషనల్ పాయింట్‌ను ఆడియెన్స్‌కు కనెక్ట్ చేయడంలో సఫలం కాలేదు. హారర్ కామెడీ అన్నారు కానీ ఫస్టాఫ్ గతంలో చాలా సినిమాల్లో చూసిన స్క్రీన్‌ప్లేతోనే నడుస్తుంది. మెయిన్ కామెడీ పార్ట్ అంతా సెకండాఫ్‌లోనే రన్ అవుతుంది. అది కూడా క్లైమాక్స్ ముందు వరకు. సినిమాలో ఓ సన్నివేశంలో జీవా, సుప్రీత్‌లు నటించారు. జీవా ఏమయ్యాడనే దానిపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు సుప్రీత్ ఎమైయ్యాడనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. సరే దెయ్యం చంపేసిందనుకుంటే సుప్రీత్‌ను మాత్రమే చంపి, జీవాను ఎందుకు వదిలేసిందనే డౌట్ వస్తుంది. అలాగే రాజీవ్ కనకాల తల్లి శ్రీనివాస్ రెడ్డి దగ్గర ఎందుకుంటుందో వివరణ కనపడదు. ఇలా స్క్రీన్‌ప్లేలో లోపాలున్నాయి. మొత్తం మీద హారర్ కామెడీ చిత్రాలను ఎంజాయ్ చేయాలనుకునే ప్రేక్షకులు సినిమాను ఓ సారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.
బోటమ్ లైన్:
ఆంనదో బ్రహ్మ.. సినిమాలో నవ్వులు కాసిన్నే.. మిగతాదంతా..బోరింగ్
Comments