Amit Shah - Jr NTR : ఆంధ్రా సెటిలర్స్ కోసమా, స్టార్ సపోర్ట్ కోసమా.. ఎన్టీఆర్- అమిత్ షా భేటీ వెనుక..?
Send us your feedback to audioarticles@vaarta.com
బీజేపీలో, కేంద్ర ప్రభుత్వంలో నెంబర్ 2గా వున్న అమిత్ షాతో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడం.. తెలంగాణతో పాటు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌లో అమిత్ షా అడుగుపెట్టడానికి ముందే ఎన్టీఆర్‌ను డిన్నర్‌ను పిలిచారన్న వార్త గుప్పుమనడంతో తెలుగు ప్రజానీకం అలర్ట్ అయ్యారు. చంద్రబాబుతో సన్నిహితంగా లేకపోయినప్పటికీ .. తాత స్థాపించిన టీడీపీ అంటే ఎన్టీఆర్‌కు గౌరవం, అభిమానం రెండూ వున్నాయి. ప్రస్తుతానికి తెలుగుదేశం కార్యకలాపాలకు దూరంగా వున్నప్పటికీ.. ఏదో ఒకరోజున జూనియర్ టీడీపీ పగ్గాలు అందుకుంటారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. అలాంటి ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ సహజంగానే ఆసక్తి రేకెత్తించింది.
సినీ ప్రముఖుల మద్ధతు కోరుతోన్న బీజేపీ:
తెలుగు రాష్ట్రాల్లో ఒక్క తెలంగాణ తప్పిస్తే.. ఏపీలో బీజేపీకి ఏమాత్రం బలం లేదన్న సంగతి తెలిసిందే. అయితే కష్టపడితే ఫలితం సాధించవచ్చన్న వ్యూహాంలో భాగంగా తెలుగు సినీ ప్రముఖులను ప్రసన్నం చేసుకుని వారి అభిమానుల ద్వారా గట్టిగా పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. జూనియర్‌తో అమిత్ షా భేటీ ఇందులో భాగమేనని చెబుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో నటనను మెచ్చుకునేందుకు ఎన్టీఆర్‌ను పిలిపించారని బీజేపీ చెబుతున్నా దీని వెనుక రాజకీయ కారణాలు ఎన్నో వున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
కేసీఆర్‌కు షాకిచ్చే వ్యూహం:
ఎన్టీఆర్ టీడీపీ కాకుండా మరో పార్టీలో చేరరని అందరికీ తెలిసిందే. కాకపోతే.. ఆయన బీజేపీకి మద్ధతు ఇచ్చినా చాలని ఆ పార్టీ భావిస్తోంది. దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ విజయాలతో తెలంగాణలో కమల దళం మంచి జోష్‌లో వుంది. కాంగ్రెస్ బలహీనమవుతోన్న నేపథ్యంలో... బీజేపీ పుంజుకుంటోంది. కాస్త కష్టపడితే కేసీఆర్‌కు షాకిచ్చి అధికారాన్ని చేజిక్కించుకోవచ్చని కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలోని ఆంధ్రా సెటిలర్లు టీఆర్ఎస్ వైపే మొగ్గుచూపుతున్నారు.
గ్రేటర్‌లో భారీగా ఆంధ్రా సెటిలర్ల ఓట్లు:
ఈ నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గంతో పాటు ఆంధ్రా సెటిలర్లను తమవైపుకు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీజేపీకి మంచి పట్టుంది.. దీనికి ఆంధ్రా సెటిలర్ల మద్ధతు తోడైతే రాజధానిలో మంచి స్థానాలు పొందే అవకాశం వుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇందుకు జూనియర్ ఎన్టీఆర్ మద్ధతు కావాలని కాషాయ నేతలు కోరుతున్నారు. అంతేకాదు.. ఇక్కడ ఎన్టీఆర్ కనుక తమతో చేతులు కలిపితే ఆంధ్రలోనూ లాభిస్తుందని వాళ్ల ప్లాన్. మరి జూనియర్‌ని దువ్వే విషయంలో బీజేపీ ఎంత వరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com