Anakapalli: అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి ఖరారు.. బరిలో డిప్యూటీ సీఎం..
- IndiaGlitz, [Tuesday,March 26 2024]
లోక్‌సభ అభ్యర్థులను అధికార వైసీపీ పూర్తిగా ప్రకటించింది. గతంలో 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ అనకాపల్లి సీటును మాత్రం పెండింగ్‌లో ఉంచింది. తాజాగా ఆ స్థానానికి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు పేరును అధికారికంగా వెల్లడించింది. కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన ముత్యాలనాయుడు ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మాడుగుల అసెంబ్లీకి ఆయన కుమార్తె అనురాధను వైసీపీ అధిష్ఠానం ఇంచార్జిగా నియమించింది. బూడి ముత్యాలనాయుడును బరిలోకి దింపుతోంది.
మరోవైపు కూటమి తరపున అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నేత సీఎం రమేష్ బరిలో నిలవనున్నారు. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన సీఎం రమేష్.. గతంలో టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. 2019 ఎన్నికల అనంతరం బీజేపీలో చేరారు. తాజాగా ఆయనను అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం బరిలో నిలిపింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ, 10 ఎమ్మెల్యే సీట్లు కేటాయించగా అందులో అనకాపల్లి ఎంపీ సీటు కూడా బీజేపీ కోటాలోకి వెళ్లింది. దీంతో వెలమ సామాజిక వర్గానికి చెందిన రమేష్ పేరును ఖరారు చేశారు.
ప్రస్తుతం అనకాపల్లి ఎంపీగా వైసీపీ తరపున సత్యవతి కొనసాగుతున్నారు. అయితే మరోసారి ఆమెను అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించేందుకు సీఎం జగన్ ఆసక్తి చూపించలేదు. దీంతో కొప్పుల వెలమ సామాజికవర్గానికి చెందిన ముత్యాల నాయుడుకు అవకాశం ఇచ్చారు. దీంతో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు వైసీపీ అభ్యర్థుల ప్రకటనను పూర్తి చేసింది. అభ్యర్థుల ఎంపిక పూర్తి కావటంతో రేపటి(మార్చి 27) నుంచి 'మేమంతా సిద్ధం' పేరుతో జగన్ బస్సుయాత్రకు సిద్ధమయ్యారు. సిద్ధం సభలు నిర్వహించిన నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు మినహాయించి మిగిలిన 21 నియోజకవర్గాల్లో 21 రోజుల పాటు ఈ యాత్ర చేపట్టనున్నారు.