గౌతమబుద్ధుడు మనుషులు పడుతున్న ఇబ్బందులకు ప్రధాన కారణం ఆశ అని చెప్పాడు. మనిషి ఆశను వదులుకోడు. ఆశని మనిషిని తప్పు దారులు తొక్కిస్తుంది. ఈ పాయింట్ మీద కన్నడ కథ కరాళ రాత్రి ఆధారంగా, 1980లో జరిగిన ఓ యథార్థ ఘటనతో తెరకెక్కిన సినిమా అనగనగా ఓ అతిథి. తొలి చిత్రం ఆర్.ఎక్స్ 100తో హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడంతో పాటు సినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. మరి ఈ సినిమాలో దర్శకుడు దయాల్ పద్మనాభన్ ఆశ వల్ల ఓ కుటుంబం ఎలాంటి ఇబ్బందులు పడింది అనే విషయాన్ని ఎలా తెరపై చూపించాడో చూద్దాం.
కథ:
ఊరికి దూరంగా ఉండే సుబ్బయ్యను అందరూ ఒంటిల్లు సుబ్బయ్య అని పిలుస్తుంటారు. అతని భార్య మంత్రసాని.. పేదరికంతోపాటు తాగుడు వల్ల సుబ్బయ్య కుటుంబాన్ని కష్టాల్లో నెడుతుంటాడు. ఉన్న పొలం కూడా తాకట్టు పెట్టేస్తాడు. పేదిరికంతో బాధపడుతున్న వారికి కూతురు మల్లిక(పాయల్ రాజ్‌పుత్) భారంగా ఉంటుంది. మల్లిక పెళ్లి చేయమని తల్లిదండ్రులను సూటీపోటీ మాటలు అంటుంటుంది. ఇలా వీరి జీవితాలు సాగుతున్న నేపథ్యంలో ఆ ఊరికి శ్రీనివాస్ అనే యువకుడు వస్తాడు. సంచారం చేస్తూ వచ్చే శ్రీనివాస్, ఎక్కడుండాలో తెలియక సుబ్బయ్య ఇంట్లోనే బస తీరుతాడు. రెండు, మూడు రోజులుంటానని చెప్పిన శ్రీనివాస్. వారి పేదరికాన్ని చూస్తాడు. అదే సమయంలో శ్రీనివాస్ దగ్గర చాలా డబ్బు, నగలు ఉన్నాయని సుబ్బయ్య కుటుంబానికి తెలుస్తుంది. తమ పేదరికం పోవాలంటే శ్రీనివాస్‌ను చంపేయాలని మల్లిక పథకం వేస్తుంది. ఆమెకు తండ్రి వత్తాసు పలుకుతాడు. ఇంతకూ ఆ కుటుంబం శ్రీనివాస్‌ను చంపేశారా? వారికి తెలిసే నిజం ఏమిటి? ఆశ వల్ల ఆ కుటుంబం ఏం కోల్పోతుంది? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సమీక్ష:
దర్శకుడు దయాల్ కథ విషయంలో పెద్ద శ్రమ పడే పని లేకుండా పోయింది. కరాళ రాత్రి నవలతో పాటు, తూర్పు గోదావరిలో జరిగిన ఓ యథార్థ ఘటనను ఆధారంగా చేసుకుని స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. అలాగే ఈ సినిమాను థియేటర్ ప్రేక్షకుల కోసం తీసినట్లు క్లియర్‌గా తెలుస్తుంది. ఎందుకంటే సినిమా వ్యవథి దాదాపు 93 నిమిషాలు మాత్రమే. ఆశ వల్ల మనిషి తన చుట్టూ ఉన్న బంధాలను, బంధుత్వాలను, నిజాన్ని గ్రహించకుండా తప్పులు చేస్తాడు. చివరకు ఆ తప్పులు చెరుపుకోలేనంత పెద్దదిగా ఉండి ప్రాణాలు తీసుకుంటాడు అనే పాయింట్‌ను తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు దయాల్. సినిమాను సాగదీసే దోరణిలో నడపలేదు. ఏం చెప్పాలనుకున్నాడో దాన్ని సింపుల్‌గా చెప్పేశాడు. పేదవారి ఆలోచనలు, జీవితాలు ఎలా ఉంటాయనే దాన్ని బేస్ చేసుకుని పాత్రలను డిజైన్ చేయడం వల్ల ముందు నుండే ప్రేక్షకుడు సినిమాకు కనెక్ట్ అవుతాడు. ఇక సినిమా క్లైమాక్స్ బావుంది. ఓ రకంగా సినిమా అంతా ఓ ఎత్తు అయితే, సినిమా చివరి పదిహేను నిమిషాలు మరో ఎత్తు.
నటీనటుల విషయానికి వస్తే గ్లామర్ ఇమేజ్ సంపాదించుకున్న పాయల్ రాజ్‌పుత్‌కి ఈ సినిమాలో పెర్ఫామెన్స్ పరంగా మెప్పించే అవకాశం దక్కిందనే చెప్పాలి. పాయల్ కూడా అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంది. చైతన్య కృష్ణ పాత్ర చుట్టూనే సినిమా తిరుగుతుంది. దాన్ని ఎమోషనల్‌గా మలిచిన తీరు బావుంది. ఇక పాయల్ తల్లిదండ్రులుగా నటించిన వారు పాత్రల్లో ఒదిగిపోయారు. మిగిలిన పాత్రధారులు వారి పాత్రలకు న్యాయం చేశారు. అరోల్ కొరెల్లి సంగీతంలో పాటలు సందర్భానుసారం బావున్నాయి. నేపథ్య సంగీతం బావుంది. విజువల్స్ పరంగానూ సినిమా బావుంది. ఇంతకు ముందు ప్రస్తావించినట్లు వ్యవథి చాలా చిన్నది. కేవలం డిజిటల్ ప్రేక్షకుల కోసం తీసిన సినిమా అని స్పష్టంగా తెలుస్తుంది. ఓసారి చూడొచ్చు.
చివరగా.. అనగనగా ఓ అతిథి.. ఓటీటీ ప్రేక్షకుల కోసమే
Comments