చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఊహించని తీర్పు
- IndiaGlitz, [Tuesday,January 16 2024]
టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. చంద్రబాబుకు అనుకూలంగా 17ఏ సెక్షన్ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ బోస్ తీర్పు ఇవ్వగా.. 17ఏ వర్తించదని జస్టిస్ త్రివేది తెలియజేశారు. దీంతో తమకు దీనిపై వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయని.. దీంతో తుది నిర్ణయం కోసం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు నివేదిస్తున్నామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు భవితవ్యం సీజేఐ చేతుల్లోకి వెళ్లింది.
స్కిల్ డెవలెప్మెంట్ కేసులో సీఐడీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలంటూ చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మాసనం.. గతేడాది అక్టోబర్ 18న తీర్పు రిజర్వ్ చేసింది. కాగా ఈ కేసులో గతేడాది సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో 52రోజల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే అక్టోబర్ 31న ఆయనకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తర్వాత నవంబర్ 20న దానిని రెగ్యులర్ బెయిల్‌గా మారుస్తూ ఉత్తర్వలు జారీ చేసింది. ఇక ఇటీవల ఇసుక, ఐఆర్ఆర్, మద్యం కేసుల్లోనూ ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది.
అయితే క్వాష్ పిటిషన్‌పై తీర్పు మాత్రం పెండింగ్‌లో ఉంది. మూడు నెలల నుంచి పెండింగ్‌లో ఉన్న తీర్పును ఇవాళ ధర్మాసనం వెల్లువరించింది. కానీ స్పష్టమైన తీర్పు రాకపోవడంతో మరికొంత కాలం వేచి చూడక తప్పదు. చంద్రబాబుకు అనుకూలంగా వస్తే మాత్రం ప్రజాప్రతినిధులపై 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేయడం కుదరదు. వ్యతిరేకంగా వస్తే మాత్రం మరిన్ని కేసులు పెట్టే అవకాశం అధికారులకు ఉంటుంది. మరి సీజేఐ ఎలాంటి తీర్పు ఇస్తారో.. అది కూడా ఎప్పుడూ ఇస్తారో స్పష్టంగా తెలియకపోవడంతో మరికొన్ని రోజలు వేచి చూడక తప్పదు.