టీపీసీసీ చీఫ్ ఎవరో తేలకముందే.. కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్
- IndiaGlitz, [Friday,January 01 2021]
పీసీసీ చీఫ్ ఎవరికి ఇవ్వాలనే దానిపై ఒకవైపు చర్చలు జరుగుతుండగానే.. కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరికపై నిర్ణయాన్ని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. వెంకన్న సాక్షిగా తన మనసులో మాటను రాజగోపాల్‌రెడ్డి బయటపెట్టేశారు. న్యూ ఇయర్ సందర్భంగా నేడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తాను రాబోయే రోజుల్లో బీజేపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. అయితే గతంలోనే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతారంటూ వార్తలొచ్చాయి.
నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనేని చెప్పిన మొదటి వ్యక్తిని తానేనన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ బలపడుతుందని, కేసీఆర్ ఒంటెద్దు పోకడలు మానాలని హితవు పలికారు. ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రతిపక్షాలను కలుపుకోవాలని సూచించారు. ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని, ప్రజారంజక నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అయితే తాను పార్టీ మారినప్పటికీ తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని తెలిపారు.
పీసీసీ చీఫ్ పదవి కోసం కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు. అయితే పీసీసీ చీఫ్‌ను కాలమే నిర్ణయిస్తోందన్నారు. పార్టీలు వేరైనా అన్నదమ్ములమిద్దరం కలిసే ఉంటామన్నారు. అయితే తమ అన్నదమ్ములిద్దరూ పీసీసీ చీఫ్ పదవిని ఆశించారు. అయితే పీసీసీ చీఫ్ పదవి రేవంత్‌కు ఖాయమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో తాను బీజేపీలో చేరతాననే సంకేతాలను రాజగోపాల్ రెడ్డి ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు అన్నదమ్ములిద్దరికీ కూడా గత కొంతకాలంగా పడట్లేదనే వార్తలు బాగా వినవస్తున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారేందుకు చూస్తున్నట్టు తెలుస్తోంది. కాగా.. తాను పార్టీ మారుతానంటూ హడావుడి చేయడం రాజగోపాల్‌రెడ్డికి మామూలేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.