అంప‌శ‌య్య న‌వ‌ల‌కు వెండితెర పై మంచి న్యాయ‌మే జ‌రిగింది - ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు

  • IndiaGlitz, [Saturday,July 16 2016]

అంపశయ్య' నవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నవీన్‌ 1969లో రాసిన ఈ నవల ఆయన ఇంటి పేరైపోయింది. ఇప్పుడీ నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం క్యాంపస్‌–అంపశయ్య'. అమ్మానీకు వందనం', ప్రణయ వీధుల్లో' చిత్రాల ద్వారా డిఫరెంట్‌ ఫిలిం మేకర్‌గా ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రభాకర్‌ జైని ఓ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు క్యాంపస్‌–అంపశయ్య' చిత్రానికి దర్శకత్వం వహించారు. జైనీ క్రియేషన్స్, ఓం నమో భగవతే వాసుదేవాయ ఫిలింస్‌ పతాకంపై విజయలక్ష్మి జైని నిర్మించిన ఈ చిత్రంలో శ్యామ్‌కుమార్, పావని జంటగా నటించారు. ఇటీవల సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో ఈ నెలాఖరున విడుదల చేయాలనుకుంటున్నారు. పలువురు సినీ ప్రముఖులకు ప్రీమియర్‌ షో వేశారు. ఈ షోని వీక్షించిన ప్రముఖుల స్పందన ఈ విధంగా...

ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ – కాలేజీ రోజుల్లో చదువుకున్న అంపశయ్య' తెలుగు జాతి అంతటినీ ఓ ఊపు ఊపింది. ఓ ప్రయోగాత్మక నవల అది. ప్రభాకర్‌ జైనిగారు సినిమాగా ఎలా తీశారు? అనే ఉత్సుకతతో ఈ ప్రీమియర్‌ షోకి హాజరయ్యాను. నా నవలను సాధ్యమైనంత వరకూ చెడగొట్టకుండా తీశారు' అని రచయిత నవీన్‌ సంతోషించారు. ద్వితీయార్ధం నాకు బాగా నచ్చింది. అంతా కొత్త నటీనటులతో ప్రభాకర్‌ జైనిగారు ఓ ప్రయోగం చేశారు. సినిమా విజయం సాధించాలని ఆశిస్తున్నాను'' అన్నారు.

తెలంగాణ రాష్ర్ట సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ – ఎంతోమంది విద్యార్థినీ, విద్యార్థులు తల్లిని క్యాంటీన్‌గా, తండ్రిని ఏటీయంగా భావించే ఈరోజుల్లో.. ఓ యాభై ఏళ్ల క్రితం విద్యార్థులు జీవితం ఎలా ఉందో తెలుసుకోవాలంటే క్యాంపస్‌ అంపశయ్య' చిత్రం చూడాల్సిందే. ప్రభాకర్‌ జైని, శ్రీమతి విజయలక్ష్మి జైని గార్లు నటించిన సన్నివేశాలు ఎంతో మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు అద్ధం పట్టాయి. నవలను చిత్రీకరించిన విధానం చాలా గొప్పగా ఉంది. మాకు నవీన్‌ గారంటే చాలా గౌరవం. ఆయన రాసిన అంపశయ్య' నవలకు ఇన్నాళ్ల తర్వాత దృశ్యరూపం ఇవ్వడం ఆనందంగా ఉంది. మన తెలంగాణాలో మంచి చిత్రాలు తీయడానికి కావలసిన లోకేషన్స్‌ ఉన్నాయని చెప్పడానికి ప్రభాకర్‌ జైని చేసిన కృషి గొప్పగా ఉంది'' అన్నారు.

అంపశయ్య' నవల రచయిత నవీన్‌ మాట్లాడుతూ – ప్రభాకర్‌ జైని ఈ సినిమా తీయడం పెద్ద సాహసమే. ఈ నవల వచ్చి 45 ఏళ్లు దాటింది. చాలామంది దీన్ని సినిమాగా తీయాలని ఆసక్తి చూపించారు. ఈ కథలో మానసిక సంఘర్షణ ఎక్కువుంది. సినిమాగా బాగుంటుందో? లేదో? అని ప్రయత్నాలను విరమించుకున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నాను. నవల స్ఫూర్తి ఎక్కడా దెబ్బ తినకుండా చాలా రియలిస్టిక్‌గా ప్రభాకర్‌ జైని చిత్రాన్ని బాగా తీశారు. నటీనటులు బాగా చేశారు. నవలకు న్యాయం జరిగింది'' అన్నారు.

చిత్రదర్శకుడు ప్రభాకర్‌ జైని మాట్లాడుతూ – నవలలోని ఆత్మను ఆవిష్కరించడానికి మాకు మూడేళ్లు పట్టింది. సరైన పాత్రధారులు దొరకడం వలన నా ప్రయత్నంలో సఫలీకృతమయ్యాను. వ్యాపారాత్మక దృకపథంతో, కమర్షియల్‌ ఫార్మాట్‌లో తీసే ఉద్దేశం లేదు. సాధ్యమైనంత వరకూ 1965–70 సంవత్సరాల్లో ఉన్న తెలంగాణ గ్రామీణ జీవితాన్ని ఆవిష్కరించాలని చేసిన ప్రయత్నమిది. ఇంతమంది పెద్దలు ఆశీర్వదించారు. కమర్షియల్‌ పరంగా కూడా విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాను'' అన్నారు.

ఇంకా ఈ షోను తిలకించిన తెలంగాణ రాష్ర్ట మంత్రివర్యులు చందూలాల్ జైన్, రచయిత ఆకెళ్ల రాఘవేంద్ర, నిర్మాత సురేశ్‌ కొండేటి, విమర్శకుడు మహేశ్‌ కత్తి' తదితరులు చిత్రం బాగుందని ప్రశంసించారు