Ammoru Thalli Review
దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు పేరు చెప్పి మతం ముసుగుతో అరాచకాలు చేసేవారు, బాబాలు చేసే పనులు ఎంత వరకు కరెక్ట్ అనే పలు అంశాలపై సినిమాలను ప్రేక్షకులు చూసే ఉంటారు. ఆ కోవలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో చిత్రం 'అమ్మోరు తల్లి'. నయనతార అమ్మవారి పాత్రలో నటించింది. నటుడు ఆర్.జె.బాలాజీ సినిమాలో నటించారు. అంతేకాకుండా ఎన్.జె.శరవణన్‌తో కలిసి ఈ సినిమాను బాలాజీ తెరకెక్కించారు కూడా. సినిమా ట్రైలర్‌లోనే.. సినిమాలో ఏ కథాంశాన్ని టచ్ చేశారనే విషయాన్ని చాలా క్లియర్‌గా చెప్పేశారు. అమ్మవారిగా నయనతార ఎలా నటించింది? సినిమాలో మతం, దైవం గురించిన అంశాలను ఏ కోణంలో చూపించారు? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం..
కథ:
కాశీబుగ్గ ఆకులపల్లి ప్రాంతం సహా చుట్టుపక్కల కలిపి దాదాపు 11 వేల ఎకరాలను భగవతీబాబా(అజయ్ ఘోష్) ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. మరో వైపు ఓ లోకల్ ఛానెల్‌లో పనిచేసే రిపోర్టర్ ఎంగేల్ రామస్వామి(ఆర్.జె.బాలాజీ) ఈ విషయాన్ని పలు చెబుతున్నా ఎవరూ పట్టించుకోరు. రామస్వామి.. తల్లి, తాతయ్య, ముగ్గురు చెల్లెల్లతో కలిసి కాశీబుగ్గ ఆకులపల్లి గ్రామంలో ఉంటాడు. దిగువ మధ్య తరగతి కుటుంబం, చిన్నప్పుడే తండ్రి విడిచిపెట్టి వెళ్లిపోవడంతో రామస్వామి కుటుంబానికి పెద్ద దిక్కుగా మారి పోషిస్తుంటాడు. అతనికి పెళ్లి చేయాలని తల్లి ప్రయత్నించినా, అతని పరిస్థితి చూసిన ఏ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాదు. రామస్వామి తల్లికి ఏడు కొండలవాడిని దర్శించుకోవాలని కోరిక ఉంటుంది. ఎప్పుడు తిరుమలకు బయలుదేరినా, ఏదో ఒక సమస్య వస్తుంటుంది. ఆ సమయంలో కులదేవతైన ముక్కుపుడక అమ్మవారిని దర్శించుకుని ఆమె గుడిలో ఓ రోజు రాత్రి నిద్ర చేస్తే మంచి మంచిదని ఓ పెద్దాయన చెప్పడంతో రామస్వామి కుటుంబమంతా ముక్కుపుడక అమ్మవారి గుడికి వెళతారు. పడుకునే ముందు రామస్వామి అమ్మవారికి తన కష్టాలను చెప్పుకుని, బాధను తీర్చడానికి అమ్మవారు(నయనతార రూపంలో) స్వయంగా వస్తుంది. తన గుడిని కూడా తిరుమల ఆలయమంతా ఫేమస్ చేయడానికి రామస్వామిని సాయం కోరుతుంది. అసలు దేవత అలా ఎందుకు కోరుతుంది? భగవతీ బాబా అన్యాయ్యాన్ని రామస్వామి ఎలా అడ్డుకున్నాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
దేవుడు భూమిపైకి వచ్చి తన భక్తులకు సాయపడే తరహా చిత్రాలను చాలానే చూసుండొచ్చు. అలాంటిది తన భూములు ఆక్రమించుకున్న ఓ దొంగబాబా నుండి.. భూములను కాపాడటానికి దేవత ఏం చేసిందనే ఓ డిఫరెంట్ పాయింట్‌తో 'అమ్మోరు తల్లి' సినిమా తెరకెక్కింది. దేవుడు భూములను స్వార్థపరులు ఎలా ఆక్రమించుకుంటున్నారు. దొంగబాబాలు భక్తులను ఎలా మోసం చేస్తున్నారు అనే పాయింట్స్‌ను ఈ సినిమాలో టచ్ చేశారు. దిగువ మధ్యతరగతి కుర్రాడిగా ఆర్.జె.బాలాజీ చక్కగా నటించాడు. బాలాజీ తల్లి పాత్రలో ఊర్వశి చాలా చక్కగా చేశారు. భర్త విడిచిపెట్టి వెళ్లిపోతే నలుగురు పిల్లలను కాపాడుకునే తల్లిగా ఓ వైపు... మరో వైపు తన కుటుంబం పరువు పోకుండా అబద్దాలు చెప్పే అమ్మగా మరో వైపు ఊర్వశి తన పాత్రను క్యారీ చేశారు. భక్తులను మోసం చేసే బాబా పాత్రలో అజయ్ ఘోష్ ఒదిగిపోయారు. సినిమాలో కొన్ని కామెడీ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సీన్స్ చక్కగా ఉన్నాయి. అయితే ఇలాంటి సినిమాలను తెరకెక్కించడం అంత సులభం కాదు..సెన్సిటివ్ అయిన విషయాన్ని బాలాజీ, శరవణన్ చక్కగా మలిచారు. దేవుడు ఎక్కడో ఉండడు. మనలోనే ఉంటాడనే విషయాన్ని వివరించే ప్రయత్నం చేశారు. పాటలు ఆకట్టుకునేలా లేవు. నేపథ్య సంగీతం బావుంది. దినేశ్ విజువల్స్ బావున్నాయి. ఎడిటింగ్ బావుంది. దేవుడు పేరుతో కొందరు చేసే అన్యాయాన్ని సినిమా రూపంలో చక్కగా మలిచారు.
బోటమ్ లైన్: అమ్మోరుతల్లి...ఆలోచింపజేసే ఎంటర్‌టైనర్
- Read in English