Ammammagarillu Review
సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న తరుణంలో యువ హీరో నాగశౌర్యకు `ఛలో` రూపంలో పెద్ద హిట్ వచ్చింది. తర్వాత తను హీరోగా నటించిన చిత్రం `అమ్మమ్మగారిల్లు`. బాలనటి బేబి షామిలి హీరోయిన్‌గా మారి నటించిన రెండో తెలుగు చిత్రమిది. వేసవి సెలవులు.. ఈ మధ్య ఫ్యామిలీ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుండటం వంటి కారణాలతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి అమ్మమ్మగారిల్లు ప్రేక్షకులకు ఎలాంటి జ్ఞాపకాన్ని మిగిల్చిందో తెలుసుకోవాలంటే కథ గురించి తెలుసుకుందాం..
కథ:
తూర్పుగోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో ఉండే సీతామహాలక్ష్మి(సుమిత్ర)గారిది పెద్ద ఉమ్మడి కుటుంబం. సీతామహాలక్ష్మి కొడుకు రవిబాబు(రావు రమేశ్) ఆస్థి పంచుకుని సిటీలో స్థిర పడాలనుకుంటాడు. కానీ కూతురు భర్త(సుమన్) ఒప్పుకోడు. గొడవలు జరుగుతాయి. ఆ బాధతో సీతా మహాలక్ష్మి భర్త(చలపతిరావు) కన్నుమూస్తాడు. కుటుంబంలో అందరూ తలో దారి చూసుకుంటారు. విడిపోయిన అందరినీ కలపాలని సీతామహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఆమె కూతురి కొడుకు సంతోశ్(నాగశౌర్య) అమ్మమ్మగారి కోరికను తీర్చడానికి ఏం చేశాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
సమీక్ష:
కలిసుందాం..రా నుండి శతమానం భవతి వరకు ఎన్నో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పే ఫ్యామిలీ సబ్జెక్ట్ ఏదీ ఉండదు. అందులో ఎమోషన్స్ చాలా ముఖ్యం. అవి కనెక్ట్ అయితే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది లేదంటే సినిమా అనుకున్నంత సక్సెస్ కాదు. పాత సినిమాల్లోని హీరోల తరహాలోనే నాగశౌర్య క్యారెక్టర్ ఇందులో డిజైన్ చేయబడింది. నాగశౌర్య తన పాత్రలో చక్కగానే చేశాడు. ఇక హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన షామిలి.. హీరోను అమ్మమ్మ ఇంటి నుండి గెంటేయడానికి చేసే పనులు హెజిటేట్ చేసేలా ఉన్నాయి. కుటుంబ సన్నివేశాల్లో రావు రమేశ్ నటన బావుంది. రావు రమేశ్ మరోసారి తన గ్రిప్పింగ్ నటనను ప్రదర్శించాడు. ఇక నాగశౌర్య, షకలక శంకర్‌కామెడీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దర్శకుడు సుందర్ సూర్య బలమైన గ్రిప్పింగ్ కథనంతో సినిమాను నడిపించలేకపోయాడు. సెకండాఫ్‌లో అనవసరమైన సన్నివేశాలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. కథలో ఎలాంటి మలుపులు ఉండవు. కాబట్టి ప్రేక్షకులు థ్రిల్ అయ్యే అవకాశం లేదు. రసూల్ ఎల్లోర్ కెమెరావర్క్ బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.
బోటమ్ లైన్: ఎమోషన్స్ కనెక్ట్ కాని 'అమ్మమ్మగారిల్లు'
Ammammagarillu Movie Review in English
- Read in English