amitabh bachchan : ఆయన నాకు దేవుడు... ఇంటి ముందు అమితాబ్ విగ్రహాన్ని ప్రతిష్టించిన ఎన్ఆర్ఐ
Send us your feedback to audioarticles@vaarta.com
భారతదేశంలో సినీ తారలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజలు వారిని తమ ఇంట్లో మనిషికన్నా ఎక్కువగా భావిస్తారు. గుడి కట్టి పూజలు చేయడమే కాదు.. అచ్చంగా వాళ్లనే అనుకరిస్తారు. ఇక అభిమాన నటుల పుట్టినరోజులు, సినిమా విడుదలల సందర్భంగా చేసే హడావుడి మామూలుగా వుండదు. తాజాగా ఓ వ్యక్తి తన అభిమాన నటుడు, బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌పై ప్రేమను చాటుకున్నాడు. ఏకంగా ఇంటి ముందు ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించి, పెద్ద పండుగ నిర్వహించాడు. ఇందుకోసం అక్షరాల రూ.60 లక్షలపైనే ఖర్చు పెట్టాడు.
రాజస్థాన్‌లో విగ్రహం తయారీ :
వివరాల్లోకి వెళితే... అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడిన ప్రవాస భారతీయుడు గోపీసేథ్కు అమితాబ్ అంటే ఎంతో ఇష్టం. ఈ నేపథ్యంలో ఇంటి ముందు ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. దీనికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చుట్టూ గ్లాస్ బాక్స్ సెట్ చేశారు. వృత్తిరీత్యా ఇంటర్నెట్ సెక్యూరిటీ ఇంజనీర్ అయిన గోపీసేథ్ అమితాబ్ విగ్రహాన్ని రాజస్థాన్‌లో తయారు చేయించి దానిని అమెరికాకు తెప్పించారు. ఇందుకోసం 60 లక్షలు ఖర్చు చేశారు.
అమితాబ్ నాకు దేవుడు :
ఈ కార్యక్రమానికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు సుమారు 600 మందిని ఆహ్వానించారు గోపీ. విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన ఇంటి వద్ద పండుగ వాతావరణం నెలకొంది. టపాసులు కాలుస్తూ, నృత్యాలు చేస్తూ వీరంతా సందడి చేశారు. అమితాబ్‌ను 30 ఏళ్ల క్రితం న్యూజెర్సీలో నవరాత్రి వేడుకల సందర్భంగా కలిశానని గోపీసేథ్ తెలిపారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి వుండే లక్షణం అమితాబ్‌లో వుందని.. ఇది తనను ఆకట్టుకుంటుందని ఆయన పేర్కొన్నారు. బిగ్‌బీ తనకు , తన భార్యకు దేవుడితో సమానమని గోపీసేథ్ చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments