తెలుగు సినీ కార్మికులకు అమితాబ్ అండ
- IndiaGlitz, [Friday,April 17 2020]
కరోనా ప్రభావంతో ప్రపంచమంతా స్తబ్దుగా మారింది. మన దేశం విషయానికి వస్తే మే 3 వరకు లాక్‌డౌన్‌ను విధించారు. దీంతో సామాన్య ప్రజలు, సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితం అయ్యారు. రోజువారీ కూలీల కోసం, పేదల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రముఖులందరూ తమకు తోచినట్లుగా విరాళాల రూపంలోనో మరో రూపంలోనో సాయపడుతున్నారు. తెలుగు సినిమా విషయానికి వస్తే కేంద్, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళం అందించిన స్టార్స్, సినిమా పరిశ్రమను నమ్ముకున్న సినీ కార్మికులను ఆదుకోవడానికి చిరంజీవి ఆధ్యక్షతన కరోనా క్రైసిస్ చారిటీ మన కోసం అనే సంస్థను స్థాపించి విరాళాలను సేకరించారు. తద్వారా సినీ కార్మికులకు కావాల్సిన నిత్యావసర వస్తువులను అందజేస్తున్నారు.
అయితే ఇప్పుడు టాలీవుడ్ కార్మికులు సాయం అందించడానికి బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ముందుకు వచ్చారు. చిరుతో ఉన్న స్నేహ బంధం కారణంగా ఆయన సినీ కార్మికుల కోసం 12000 బిగ్ బజార్ కూపన్లను అందించారు. ఒక్కొక్క కూపన్ విలువ రూ.1500. దీంతో బిగ్ బజార్‌లో సరుకులను కొనుగోలు చేయవచ్చు. దీంతో రూ.1.8 కోట్లు విరాళాన్ని తెలుగు సినీ కార్మికులకు అమితాబ్ అందించారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేస్తూ అమితాబ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.