సినీ కార్మికులకు అండగా నిలబడుతున్న అమితాబ్
- IndiaGlitz, [Monday,April 06 2020]
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం ఏం చేస్తున్నారు? కరోనా వైరస్ ప్రభావంతో ఇంటికే పరిమితమై ఉన్నారు. ఆయనే బాలీవుడ్ సహా ఎంటైర్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీది అదే పరిస్థితి. చిన్నా, పెద్ద సినీ స్టార్స్ అందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. ప్రజలంరినీ ఇళ్లల్లోనే ఉండమని అంటున్నారు. స్టార్స్ సంగతి సరే!.. మరి సినీ పరిశ్రమకు చెందిన రోజువారీ కార్మికుల సంగతేంటి? సినిమాలు ఉంటేనే కానీ వారి కుటుంబాలు నడవలేని పరిస్థితి. దీంతో సినీ ప్రముఖులందరూ వారిని ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు.
ఆల్ ఇండియా ఎంప్లాయిస్ ఫిల్మ్ కాన్ఫిడరేషన్‌లో రోజువారీ కార్మికులు లక్ష మంది ఉన్నారు. వారందరికీ నెలరోజుల పాటు రేషన్‌ను అందించనున్నారట అమితాబ్. ఈ కార్యక్రమానికి సోనీ పిక్చర్స్, కల్యాణ్ జ్యువెలర్స్ తమ మద్దతుని తెలియజేస్తున్నాయి. ‘‘ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ సమయంలో మనకు మనమే సాయం చేసుకోవాలి. దేశవ్యాప్తంగా ఉన్న లక్ష మంది సినీ కార్మికులకు నెల వారీ రేషన్‌ను అందించబోతున్నాం. అమితాబ్‌గారితో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహిస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అని సోనీ పిక్చర్స్ ప్రతినిధులు తెలిపారు.