సైరాలో అమితాబ్ లుక్‌

  • IndiaGlitz, [Thursday,October 11 2018]

చారిత్రాత్మ‌క నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న చిత్రం 'సైరా న‌ర‌సింహా రెడ్డి'. మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 151వ చిత్ర‌మిది. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన తొలి యోధుడు ఓ తెలుగువాడు.. ఆయ‌నే ఉయ్యాల‌వాడ న‌ర‌సింహా రెడ్డి. ఆయ‌న జీవిత చ‌రిత్ర‌నే 'సైరా న‌ర‌సింహారెడ్డి'గా తెర‌కెక్కిస్తున్నారు.

భారీ బ‌డ్జెట్‌తో రామ్‌చ‌ర‌ణ్ నిర్మాణంలో సురేంద‌ర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న చిత్ర‌మిది. ఈ చిత్రంలో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే తెల్ల‌టి గుబురు గ‌డ్డంతో ఉన్న అమితాబ్ లుక్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న సంగ‌తి తెలిసిందే.

నేడు అమితాబ్ 76 పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సైరా యూనిట్ ఆయన ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి గురువు గోసాయి వెంక‌న్న పాత్ర‌లో అమితాబ్ న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రంలో ఇంకా న‌య‌న‌తార, విజ‌య్ సేతుప‌తి, కిచ్చాసుదీప్‌, జ‌గ‌ప‌తిబాబు త‌దితరులు కీల‌క పాత్ర‌ధారులు.