Amit Shah: చంద్రబాబు ముందు అమిత్ షా కొత్త ఫార్ములా.. వర్క్‌వుట్ అవుతుందా..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మరికొన్ని ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో అధికార వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తూ దూకుడు ప్రదర్శిస్తుంటే.. ప్రతిపక్ష టీడీపీ-జనసేన కూటమి మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే పోటీ చేసే స్థానాలపై ఇరు పార్టీలు ఓ అంచనాకు వచ్చాయి. అభ్యర్థులను కూడా ప్రకటిద్దాం అనుకున్నారు. కానీ ఇంతలోనే పొత్తులపై చర్చించేందుకు బీజేపీ పెద్దలు నుంచి టీడీపీ చీఫ్ చంద్రబాబుకు ఆహ్వానం వచ్చింది. దీంతో వెంటనే ఆయన ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఎన్డీఏలోకి చంద్రబాబును షా ఆహ్వానించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఆ సమావేశంలో చంద్రబాబుకు అమిత్ షా పెట్టిన ప్రపోజల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. టీడీపీని ఎన్డీఏలోకి చేర్చుకునేందుకు అంగీకరిస్తూనే.. 4:2:1 నిష్పత్తిలోనే సీట్ల పంపకాలు జరగాలని మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. ఆ ఫార్ములా ప్రకారం ఏపీలోని మొత్తం 175 శాసనసభ స్థానాలకు గానూ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీకి 4, జనసేనకు 2, బీజేపీకి 1 స్థానం కేటాయించాలి. అంటే మొత్తంగా తెలుగుదేశం పార్టీకి 100 సీట్లు, జనసేనకు 50 సీట్లు, బీజేపీకి 25 సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 25 ఎంపీ సీట్లలో టీడీపీకి 14, జనసేనకు 7, బీజేపీకి 4 స్థానాలు కేటాయించాలి.
అయితే ఈ ప్రతిపాదనకు చంద్రబాబు సుముఖంగా లేరనే వాదన వినిపిస్తుంది. తెలుగు తమ్ముళ్లు కూడా ఇందుకు అంగీకరించే ప్రసక్తే లేదని అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. కొంతమంది అసలు బీజేపీతో పొత్తు వద్దని కోరుతున్నారు. అయితే ఎన్నికలు సజావుగా జరగాలంటే కేంద్ర ప్రభుత్వం మద్దతు అవసరమని మరికొంతమంది చెబుతున్నారు. ఒకవేళ కమలం పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే జనసేన, బీజేపీలకు కలిపి 35-40 అసెంబ్లీ సీట్లు, 6-7 ఎంపీ సీట్లు ఇవ్వాలని సూచిస్తున్నారు.
కాగా 2014 ఎన్నికల సమయంలో జనసేన పార్టీ పోటీలో నిలవలేదు కాబట్టి టీడీపీ 162 ఎమ్మె్ల్యే, 21 ఎంపీ సీట్లలో.. బీజేపీ 13 ఎమ్మెల్యే, 4 ఎంపీ స్థానాలలో బరిలో నిలిచాయి. అయితే ఇప్పుడు జనసేన కూడా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో బీజేపీకి అన్ని సీట్లు ఇవ్వడం కుదరకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరికొన్ని రోజుల్లోనే పొత్తులపై క్లారిటీ రానున్న నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments