ఏపీ వరదలు: గీతా ఆర్ట్స్ ఒక్కటేనా.. మిగిలిన సినీ జనాలకు పట్టదా..?
Send us your feedback to audioarticles@vaarta.com
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌ను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తినష్టం జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్ధితులు నెలకొల్పేందుకు ప్రభుత్వం సహాయ కార్యక్రమాలను కూడా ప్రారంభించింది. బాధితులను ఆదుకోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మరోవైపు అభాగ్యులను ఆదుకోవడానికి పలు స్వచ్ఛంద సంస్ధలు, దాతలు ముందుకు వస్తున్నారు. తమకు చేతనైనంతలో ప్రభుత్వం ద్వారానో , లేదంటే నేరుగానో బాధితులకు అండగా నిలుస్తున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విపత్తు జరిగినా వెంటనే సినీ పరిశ్రమ స్పందిస్తూ వుంటుంది. అన్నగారి హయాం నుంచి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఆపదలో వున్న ప్రజల పక్షాన నిలిచిన సంగతి తెలిసిందే. దివి సీమ ఉప్పెన సమయంలో ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు రాష్ట్రవ్యాప్తంగా జోలె పట్టి స్వయంగా విరాళాలు సేకరించి ప్రభుత్వానికి అందజేశారు. ఆ తర్వాత చిరంజీవి తరంలో సినీ తారల క్రికెట్ మ్యాచ్‌ల ద్వారా సేకరించిన నిధులను బాధితులకు అందజేశారు. మొన్నామధ్య హుదుద్ తుఫాన్ సమయంలోనూ టాలీవుడ్ ఏకతాటిపైకి వచ్చింది. హైదరాబాద్‌లో ఆటలు , పాటల ద్వారా ‘‘మేము సైతం’’ అంటూ నిధులను సేకరించడంతో పాటు వ్యక్తిగతంగా కూడా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విరాళాలు ఇచ్చారు.
అయితే నేటి వరదల విషయానికి వచ్చే సరికి సినీ పరిశ్రమ నుంచి ఆశించిన స్పందన రావడం లేదు. ఒక్క అల్లు అరవింద్ కుటుంబానికి చెందిన గీతా ఆర్ట్స్ మాత్రమే వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు పది లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. దీనిని ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు పంపుతున్నట్లు తెలిపింది. తెలుగు సినిమాలకు ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువ ఆదాయం వస్తుంది. అంతేకాదు ఇండస్ట్రీలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల్లో 90 శాతం ఏపీ వారే. అయితే ప్రస్తుతం టాలివుడ్‌కు, ముఖ్యమంత్రి జగన్‌కు మధ్య సంబంధాలు అంతంత మాత్రమే ఉండటంతో ఈసారి పరిశ్రమ నుంచి స్పందన రావడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి విపత్కర పరిస్ధితుల్లో రాజకీయాలు, వివాదాలు చూడకుండా తమను ఇంత వారిని చేసిన ప్రజలకు అండగా నిలబడాలని పలువురు సోషల్ మీడియా ద్వారా సూచిస్తున్నారు. ఇప్పుడు గీతా ఆర్ట్స్ మొదటి అడుగు వేయడంతో మిగిలిన హీరోలు, నిర్మాతలు, దర్శకులు వరద బాధితుల సాయానికి ముందుకు వస్తారేమో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout