Ami Thumi Review
నటీనటుల పేర్లను బట్టి కొన్ని సినిమాలకు జనాలు వెళ్తుంటారు. కేవలం దర్శకుల పేర్లను చూసి థియేటర్లు నిండే చిత్రాలు కూడా ఉంటాయి. ఇంద్రగంటి మోహనకృష్ణ చిత్రాలు ఆ కోవకు చెందినవే. అనునిత్యం మన జీవితంలో చోటుచేసుకునే అంశాలను తెరపై హృద్యంగా చూపించగల దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఆ మధ్య నానితో `జంటిల్ మేన్` తీసిన ఆ దర్శకుడు తాజాగా `అమీతుమీ`ని తెరకెక్కించారు. అవసరాల శ్రీనివాస్, అడివి శేష్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో వెన్నెల కిశోర్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ఎలా ఉందని ఓ సారి పరిశీలిద్దాం...
కథ:
జనార్దన్ (తనికెళ్ల భరణి) తెలంగాణకు చెందిన వ్యక్తి. హైదరాబాద్‌లో ఉంటాడు. భార్యను పోగొట్టుకున్న ఆయనకు ఓ కూతురు దీపిక (ఈషా), కొడుకు విజయ్ (అవసరాల శ్రీనివాస్) ఉంటారు. సేల్స్ మేనేజర్‌గా పనిచేసే అనంత్ (అడవి శేష్)ని దీపిక ప్రేమిస్తుంది. జనార్దన్ ఎక్స్ పార్ట్ నర్ కుమార్తె మాయ (అదితి)ని విజయ్ ప్రేమిస్తాడు. తన పిల్లల ప్రేమ వ్యవహారాలు జానర్దన్‌కు నచ్చవు. అందుకే అంతా తను చెప్పినట్టే జరగాలని అనుకుంటాడు. ఆమేరకే వైజాగ్‌కి చెందిన శ్రీ చిలిపి (వెన్నెల కిశోర్)ని అల్లుడిగా చేసుకోవాలని అనుకుంటాడు. శ్రీ చిలిపి హైదరాబాద్‌లో అడుగుపెట్టడంతో సినిమా అసలు కథ మొదలవుతుంది. దీపిక ఫోటో కూడా చూడకుండా పెళ్లి చేసుకోవాలనుకున్న శ్రీచిలిపికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఇంతకీ కుమారి ఎవరు? శ్రీచిలిపికి ఎక్కడ పరిచయమైంది? వంటివన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ప్లస్ పాయింట్లు:
ఫోటోగ్రఫీ బావుంది. తనికెళ్ళ భరణి ఇల్లు ఇంటీరియర్ డెకరేషన్ చూడ్డానికి రిచ్‌గా ఉంది. అడవిశేష్, ఈషా జంట చూడ్డానికి బావుంది. తనికెళ్ళభరణి, ఈషా, అవసరాల మాట్లాడే తెలంగాణ యాస కూడా బావుంది. శ్రీచిలిపి పాత్రలో వెన్నెలకిశోర్ హైలైట్. ఒకరకంగా చెప్పాలంటే సినిమా మొత్తాన్ని భుజానికెత్తుకుని నడిపించిన పాత్ర అది. కుమారి పాత్రధారి నటన ఆకట్టుకుంటుంది. మిగిలిన అందరూ తమ తమ పాత్రల్లో మెప్పించారు.
మైనస్ పాయింట్లు:
అతి తక్కువ పాత్రలే ఉన్నా.. సినిమాలో ఎక్కడా నవ్యత కనిపించదు. ఏ సన్నివేశంలోనూ ప్రేక్షకుడు ఆహా అనుకోడు. డైలాగులు కూడా ఎప్పుడో విన్నట్టుగానే అనిపిస్తాయి. కథలోగానీ, కథలోగానీ కొత్తదనాన్ని మచ్చుకైనా ఆశించకూడదు. మధుమణి నటించిన పిన్ని పాత్ర పర్పస్ ఏంటో అర్థం చేసుకోవడం కష్టం. రెండు పాటలున్నా ఎక్కడా రిజిస్టర్ కావు. రీరికార్డింగ్ ఫర్వాలేదు. ఫస్టాఫ్‌లో తొలి పది నిమిషాలు, సెకండాఫ్‌లో చాలా భాగం పదునుగా ఎడిట్ చేస్తే బావుండేది.
విశ్లేషణ:
ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమా అనగానే ప్రేక్షకుడు అచ్చ తెలుగు కామెడీని ఆశిస్తాడు. అందులోనూ ఈ సినిమా `అష్టాచమ్మ`ను గుర్తుచేస్తుందని ఇంద్రగంటి ఈ మధ్యనే చెప్పారు. వంకాయ సీన్‌తో పాటు, హీరోల మధ్య వచ్చే కొన్ని సీన్లు ఆ బాధ్యతను నిర్వర్తించిన మాట వాస్తవమే. కానీ ఆ చిత్రంలో కనిపించే ఆత్మ ఇందులో కొరవడినట్టే అనిపిస్తుంది. వెన్నెలకిశోర్ పాత్ర, కుమారి పాత్ర లేకుంటే సినిమా శూన్యం. తన కూతురి ప్రేమ నచ్చని తండ్రి ఆమె బంధించే తీరులో ఎక్కడా సీరియస్‌నెస్ ఉండదు. కొడుకును బయటికి పొమ్మనే సన్నివేశం కూడా చాలా సాదాసీదాగా ఉంటుంది. మధుమణి గన్ పుచ్చుకుని వచ్చిన ప్రతిసారీ విసుగనిపిస్తుంది. అనంత్‌ని, శ్రీచిలిపిని చూసి ఎస్ఎంఎస్ పంతులు గేలు అనుకుంటారు. ఇది కూడా కొత్త సన్నివేశం ఏమీ కాదు. సరైన కథ, సన్నివేశాలు లేకపోవడంతో సెకండాఫ్ మొత్తం మరింత సాగదీసినట్టుగా అనిపిస్తుంది. అమీ తుమీ అని టైటిల్ పెట్టిన దర్శకుడు కథ విషయంలోనే అదేదో తే్ల్చుకుని ఉంటే ఇంకాస్త బావుండేది.
బాటమ్ లైన్: సాదాసీదాగా 'అమీ తుమీ'
Ami Thumi English Version Movie Review
- Read in English