ఆటా మహాసభలకు ఎర్రబెల్లికి ఆహ్వానం.. తప్పక వస్తానన్న మంత్రి
Send us your feedback to audioarticles@vaarta.com
అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ 17వ మహాసభలు జూలై 1 నుంచి జూలై 3 తేదీ వరకు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఆహ్వానించారు నిర్వాహకులు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఆటా సభలకు తాను గతంలోనూ వెళ్ళానని చెప్పారు. అమెరికా వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళంతా పండుగగా నిర్వహించుకునే ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయని ఎర్రబెల్లి తెలిపారు. ఆటా ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలుపుతూ, తాను తప్పక హాజరవుతానని మంత్రి హామీ ఇచ్చారు.
ఎర్రబెల్లి దయాకర్ రావుని కలిసిన వారిలో ఆటా ప్రతినిధులు జయంత్ చల్లా, శరత్ వేముల, రఘువీర్ రెడ్డి, సన్నీ రెడ్డి వున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. 1990లో ఏర్పడిన ‘‘ఆటా’’ అమెరికాలో తెలుగు కళలు, సంప్రదాయాలు, సంస్కృతీ పరిరక్షణకు పాటుపడుతోందని తెలిపారు. ప్రతి రెండేండ్లకోసారి జరిగే ఈ మహాసభలకు వివిధ రంగాలకు చెందిన తెలుగు వారిని ఆహ్వానించి పలు అంశాలపై చర్చిస్తామని వారు వెల్లడించారు.
ఇకపోతే... ఈసారి ఆటా సభలకు దాదాపు 15,000 మందికి పైగా హాజరవుతారని అంచనా. ఇందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. కరోనా మహమ్మారి కారణంగా గడిచిన రెండేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయారు. ప్రస్తుతం అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా వైరస్ అదుపులోకి రావడంతో ఈసారి తెలుగు మహాసభలను భారీఎత్తున నిర్వహించాలని ఆటా నిర్వాహక కమిటీ నిర్ణయించింది. సభల నిర్వహణకు సంబంధించి 65 కమిటీలను ఏర్పాటు చేశామని ఆటా ప్రెసిడెంట్ భువనేష్ బూజల మీడియాకు తెలిపారు. ఇందులో దాదాపు 350 మందిని సభ్యులుగా ఎన్నుకున్నట్లు తెలిపారు. వీరంతా మహాసభలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తారని భువనేష్ వెల్లడించారు.
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పద్మవిభూషణ్ జగ్గీ వాసుదేవ్ (సద్గురు) , ప్రముఖ కవులు, కళాకారులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ , రకుల్ ప్రీత్ సింగ్ , గాయకుడు రాం మిరియాల ఆటా సభలకు హాజరుకానున్నారు. అలాగే దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా ఆధ్వర్యంలో సంగీత విభావరికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments