Ambulance Driver:సైరన్ వేసుకొచ్చి .. మిర్చిబజ్జీలు తిన్న అంబులెన్స్ డ్రైవర్: డీజీపీ సీరియస్, ఇలా చేస్తే కఠిన చర్యలే
Send us your feedback to audioarticles@vaarta.com
రోడ్డు ప్రమాదమైనా, ఆరోగ్యం బాగోకపోయినా, పురిటి నొప్పులైనా, కళ్లముందు ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో వున్నా వెంటనే గుర్తొచ్చేది అంబులెన్స్. ఫోన్ చేసిన తక్షణం ఎక్కడికైనా కుయ్.. కుయ్ మంటూ వాలిపోతుంది . అంబులెన్స్‌కు వుండే సైరన్ ద్వారా ప్రజలు , వాహనదారులు, పోలీసులు దానికి అనుగుణంగా సహకరిస్తారు. అయితే ఈ సైరన్‌ను కొంతమంది అంబులెన్స్ డ్రైవర్లు దుర్వినియోగం చేస్తున్నారు. లోపల పేషెంట్ లేకపోయినా , ఎమర్జెన్సీ కాకపోయినా సైరన్ వేస్తూ.. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారు. తాజాగా ఓ అంబులెన్స్ డ్రైవర్ మిర్చి బజ్జి తినడానికి సైరన్ వేసుకుంటూ వెళ్లాడు. ఈ ఘటనపై తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ సీరియస్ అయ్యారు. అవసరం వుంటేనే సైరన్ వేసుకుంటూ రావాలని సూచిస్తూ.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ట్వీట్ ద్వారా తెలియజేశారు.
ఓ సాయంత్రం పూట ట్రాఫిక్ రద్దీతో వున్న హైదరాబాద్ నారాయణ గూడ వైఎంసీఏ సర్కిల్ వద్ద ఓ అంబులెన్స్ డ్రైవర్ సైరన్ మోగిస్తూ.. రయ్ రయ్ మంటూ దూసుకొస్తున్నాడు. ఇది విన్న ట్రాఫిక్ పోలీసు ఎవరైనా ప్రాణాపాయంలో వున్నారేమో అనుకుని వెంటనే ట్రాఫిక్‌ను క్లియర్ చేసి అంబులెన్స్‌కు దారి ఇచ్చాడు. ఆ కాసేపటికీ అంబులెన్స్ డ్రైవర్ అక్కడికి దగ్గరలోని ఓ బజ్జీల బండి వద్ద ఆగి తీరిగ్గా బజ్జీలు తినడం ప్రారంభించాడు. దీనిని దూరం నుంచి చూసిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు కోపం నషాళానికి అంటింది. వెంటనే అతని వద్దకు వెళ్లి.. సైరన్ ఎందుకు మోగించావని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. దీనికి సంబంధించిన వీడియోను తీశాడు.
ఇది డీజీపీ దాకా వెళ్లడంతో అంజనీకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం అత్యవసర పరిస్ధితుల్లో మాత్రమే దానిని వినియోగించాలని తెలిపారు. సైరన్‌ను ఇష్టమొచ్చినట్లు వాడితే కఠిన చర్యలు తప్పవని సీరియస్ అయ్యారు. స్వయంగా డీజీపీ ట్వీట్ చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com