Ambedkar Statue: విజయవాడ సిగలో మరో మణిహారం.. రేపే భారీ అంబేద్కర్ విగ్రహావిష్కరణ..

  • IndiaGlitz, [Thursday,January 18 2024]

విజయవాడ సిగలో మరో మణిహారం నిలవనుంది. నగరానికే తలమానికం కానున్న రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రేపు(శుక్రవారం) సాయంత్రం సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ఈ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు. రాష్ట్రానికే కాకుండా దేశానికే గర్వకారణంగా నిలిచే అంబేద్కర్ విగ్రహం చరిత్రను తిరగరాసేలా. మరెందరికో వందల సంవత్సరాల పాటు స్ఫూర్తినిస్తుందని ఆయన పేర్కొన్నారు.

206 అడుగల ఎత్తులో..

స్టాచ్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ పేరిట విజయవాడ బందర్ రోడ్డులో 125 అడుగులు భారీ అంబేద్కర్ విగ్రహం ప్రభుత్వం నిర్మించింది. 81 అడుగుల ఎత్తైన పీఠంపై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారు. దీంతో విగ్రహం మొత్తం ఎత్తు 206 అడుగులు ఉంటుంది. దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా ఇది నిలవనుంది. 18.81 ఎకరాల్లో స్మృతివనాన్ని కూడా ఏర్పాటు చేశారు. 9 ఎకరాల్లో పూర్తిగా పచ్చదనంతో నిండి ఉంది. స్మృతివనంలో అంబేద్కర్ ఫొటో గ్యాలరీతో పాటు ఆయన జీవిత విశేషాలు, శిల్పాలు, కన్వెన్షన్ హాల్, యాంఫీ థియేటర్‌, మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. లైబ్రరీతో పాటు ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ కూడా సిద్ధం చేశారు. కాంస్య విగ్రహాన్ని ఢిల్లీలో తయారు చేయించగా.. దాన్ని భాగాలుగా విజయవాడకు తరలించి స్మృతివనంలో క్రమ పద్ధతిలో అతికించి అద్భుతంగా తీర్చిదిద్దారు.

రూ.400కోట్ల ఖర్చుతో..

ఇక గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నాలుగు హాళ్లుండగా.. ఒక్కోటి 4వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. అందులో ఒకటి సినిమా హాలు కాగతా మిగిలిన మూడు హాళ్లలో ఆయన చరిత్రను తెలిపే డిజిటల్‌ మ్యూజియం ఉంటుంది. ఇందుకు మొత్తం రూ.400కోట్లు ఖర్చు చేసింది. అంబేద్కర్‌ విగ్రహావిష్కరణతో పాటు సామాజిక సమతా సంకల్ప సభకు సంబంధించిన పోస్టర్‌ను ఇప్పటికే విడుదల చేశారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం జగన్ పరిపాలన చేస్తున్నారని వైసీపీ నేతలు కొనియాడుతున్నారు. అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. కాగా హైదరాబాద్‌లోనూ ట్యాంక్ బండ్ ఎదురుగా గతేడాది ఏప్రిల్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని అప్పటి సీఎం కేసీఆర్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.