Ambati: ఎవరి కుటుంబంలో గొడవలు లేవు.. అల్లుడు వీడియోపై అంబటి స్పందన
Send us your feedback to audioarticles@vaarta.com
మంత్రి అంబటి రాంబాబుకు ఓటేయొద్దంటూ ఆయన సొంత అల్లుడు డాక్టర్ గౌతమ్ ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియోపై అంబటి స్పందించారు. ఆయన ఏమన్నారంటే..
"మా అల్లుడు వీడియోపై మాట్లాడదలుచుకోలేదు. కానీ దీనిపై ఎందుకు మాట్లాడుతున్నానంటే.. ఈ వీడియో అంశాన్ని పవన్ కల్యాణ్ పొన్నూరులో ప్రస్తావించారు. మా అల్లుడు గౌతమ్, నా కుమార్తె విడాకులు తీసుకుంటున్నారు. ఆ ప్రక్రియ నడుస్తోంది కోర్టులో మేం న్యాయపోరాటం చేస్తున్నాం. ఇది మా కుటుంబ విషయం. బయటివారికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కూతురుకు సంబంధించిన విషయం కాబట్టి బహిర్గతం చేయాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు. నాలుగేళ్ల కిందట అతడు నా కూతురిని అర్ధంతరంగా వదిలేస్తే... నా కూతురిని సంరక్షించుకుంటున్న వ్యక్తిని నేను. నా కూతురినే కాదు... గౌతమ్ కూతురిని, కొడుకును కూడా సంరక్షిస్తున్నాను. ఈ క్రమంలో నేను దుర్మార్గుడ్ని అంటూ అల్లుడు వీడియో విడుదల చేశాడు.
నా కూతుర్ని వదిలేసిన అల్లుడే దుర్మార్గుడు.. తన కూతురిని, కొడుకును కూడా వదిలేసిన అతడే దుర్మార్గుడు... నేనెలా దుర్మార్గుడ్ని అవుతాను? ఇవాళ నా అల్లుడు మాత్రమే మాట్లాడితే నేను అస్సలు మాట్లాడేవాడ్ని కాదు... కానీ నా అల్లుడి మాటల వెనుక పవన్ కల్యాణ్ ఉన్నాడు. పవన్ కల్యాణే అతడితో మాట్లాడించాడు, చంద్రబాబు అందుకు సపోర్ట్ చేస్తున్నాడు, ఏబీఎన్, టీవీ5 దీన్ని పదే పదే ప్రసారం చేస్తున్నాయి. ఇది దుర్మార్గం కాదా? ఒక కుటుంబ విషయాన్ని ఇంత తీవ్రస్థాయిలో రచ్చకీడ్చి రాజకీయ లబ్ధి పొందడాన్ని ఏమనాలి? అదీ నా ఆవేదన!
నేను కూడా ఇలాగే మాట్లాడదలచుకుంటే...! ఎవరి కుటుంబంలో గొడవలు లేవు? చిరంజీవి గారూ... మీ తమ్ముడికి చెప్పండి... మీ కుటుంబంలో గొడవలు లేవా? మీ కూతురికి సంబంధించి వివాదాలు లేవా? నాగబాబు గారూ... మీ కుటుంబంలో గొడవలు లేవా? మీ కూతురికి సంబంధించి వివాదాలు లేవా? అక్కడిదాకా ఎందుకు... నా ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణకు ఇద్దరు కుమారులు... మీకు వివాదాలు లేవా? మీరు కోర్టులకు పోలేదా? అని అంబటి ప్రశ్నించారు.
అంతకుముందు అంబటి అల్లుడు గౌతమ్ ఓ వీడియోలో మాట్లాడుతూ ‘‘నాపేరు డాక్టర్ గౌతమ్. మంత్రి అంబటి రాంబాబు అల్లుడ్ని. అది నా దురదృష్టకరం. దానికి ఎవరూ ఏం చేయలేదు. ఈ వీడియో చేయాలా వద్దా అని నేను బాగా ఆలోచించి.. చేయడం నా బాధ్యతగా భావించి ఈ వీడియో చేస్తున్నాను. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నా జీవితంలో చూడలేదు. రోజూ దేవుడికి దండం పెట్టుకొనేటప్పుడు ఇంతటి నీచుడ్ని ఇంకోసారి నా జీవితంలో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని మొక్కుకుంటాను. అంత భయంకరమైన వ్యక్తి అంబటి. ఆయన పోటీ చేయబోయే పోస్టుకు మంచితనం, మానవతా విలువలు, కనీస బాధ్యత ఉండాలో.. ఆయనలో అవి లేవు. కనీసం ఇవన్నీ 100 శాతం ఉండక్కర్లేదు. కానీ, వీటిలో 0.001 శాతం లక్షణాలు కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటివారికి ఓటు వేస్తే సమాజం కూడా ఇలాగే తయారవుతుంది. దీన్ని ప్రజలు గమనించి మీ ఓటును బాధ్యతతో సరైన వ్యక్తికి వేసి, మంచి నాయకుడ్ని ఎంచుకుంటారని ఆశిస్తున్నాను’’ అని తెలిపారు. దీంతో ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com