అంతర్జాతీయ క్రికెట్‌కు అంబటి రాయుడు గుడ్ బై

అంతర్జాతీయ క్రికెట్‌కు తెలుగు బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు గుడ్ బై చెప్పేశారు. ఐపీఎల్‌తో పాటు అన్ని ఫార్మాట్లకూ వీడ్కోలు చెప్పేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపాడు. తెలుగు క్రీడాకారుడు అంబటిని వరల్డ్‌కప్‌కు కచ్చితంగా ఎంపిక చేస్తారని అందరూ భావించారు. అయితే తెలుగు రాష్ట్రాల క్రీడాభిమానుల ఆశలన్నీ ఆవిరయ్యాయి. ప్రపంచకప్‌కు ఆడేందుకు రాయుడ్ని తీసుకోవట్లేదని టీమిండియా తేల్చేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాయుడు ఐపీఎల్‌ సహా అన్ని ఫార్మాట్లకూ వీడ్కోలు చెప్పేస్తున్నట్లు షాకింగ్ ప్రకటన చేశాడు.

అసలేం జరిగింది..!

ఈ సందర్భంగా రాయుడు.. తనను కాకుండా విజయ్ శంకర్ అనే ఆటగాడిని టోర్నీకి ఎంపిక చేయడంతో ‘ఈ ప్రపంచకప్ చూసేందుకు త్రీడీ కళ్లద్దాలు కొన్నాను’ అని రాయుడు వ్యాఖ్యానించాడు. విజయ్‌ శంకర్‌ గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించగా.. అతడి స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకోవడం జరిగింది. రెండో సారీ అవకాశం రాలేదన్న నిరాశతో రాయుడు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. అంబటి ప్రకటనతో బీసీసీఐ పెద్దలు స్పందిస్తూ.. రాయుడు త్రీడీ ప్లేయర్ అనీ, అందుకే అతడిని జట్టులోకి ఎంపిక చేయలేదని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఈ రియాక్షన్‌తో అంబటి మరింత అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. రాయుడు ప్రకటనతో తెలుగు క్రీడాభిమానుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మన తెలుగోడే..!

రాయుడు మన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వాసి. సాంబశివరావు, విజయలక్ష్మి దంపతులకు రాయుడు 1985, సెప్టెంబర్ 23న అంబటి జన్మించాడు. 2001-02లో రంజీ టోర్నీలో హైదరాబాద్ జట్టుకు.. 2005-06 రంజీ సీజన్‌లో ఏపీ తరఫున ఆడి అందరి మన్ననలు పొందాడు. అలా 2003-04 అండర్ 19 ప్రపంచకప్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. 2015 ప్రపంచకప్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇప్పటివరకూ 55 వన్డేలు ఆడిన రాయుడు 47.06 సగటుతో 1694 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యధికంగా 124 స్కోర్ నమోదు చేశాడు. ఇక ఐపీఎల్‌లో 147 మ్యాచ్‌లు ఆడిన రాయుడు 3,300 పరుగులు చేశాడు. చివరగా ఐపీఎల్‌ -2019లో చెన్నై సూపర్‌ కింగ్స్ తరఫున 17 మ్యాచ్‌లు ఆడిన రాయుడు 282 పరుగులు చేశాడు.