Ambati Rayudu:వైసీపీ నుంచి గుంటూరు లేదా వైజాగ్ ఎంపీగా అంబటి రాయుడు పోటీ..!
Send us your feedback to audioarticles@vaarta.com
భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) వైసీపీలో చేరనున్నారని కొన్ని రోజులుగా జరుగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఆ పార్టీ అధినేత, సీఎం జగన్(CM Jagan)సమక్షంలో ఆయన అధికారికంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో రాయుడు పోటీ చేయడం కూడా ఖాయమైంది. అయితే అది అసెంబ్లీకా..? పార్లమెంట్‌కా..? అనేది తేలాల్సి ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన రాయుడు.. జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తారని వినిపించింది. పెదకూరపాడు, పొన్నూరు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో అంబటి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఆయన కూడా ఈ నియోజకవర్గాల్లో పర్యటించారు. కానీ రాయుడుకున్న ఇమేజ్ దృష్ట్యా పార్లమెంట్ స్థానం నుంచే పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారట.
గుంటూరు ఎంపీగా రాయుడు అయితే గెలవొచ్చు..
ఇందులో భాగంగా గుంటూరు ఎంపీగా రాయుడు పోటీ చేయనున్నారనే వార్తలు వినపడుతున్నాయి. అమరావతి రాజధాని ఎఫెక్ట్, సామాజికవర్గాల లెక్కలు తీసుకుంటే గుంటూరులో గెలవడం కష్టంగా మారనుంది. గతంలో జగన్ గాలి విపరీతంగా ఉన్నప్పుడే గుంటూరు ఎంపీ స్థానం నుంచి టీడీపీ నుంచి గల్లా జయదేవ్ గెలిచారు. ఇప్పుడు వైసీపీకి అంత ఊపు లేదు. పైగా ప్రభుత్వ వ్యతిరేకగా విపరీతంగా ఉంది. దీంతో క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్న రాయుడు లాంటి తెలిసిన వ్యక్తే నెగ్గుకురావొచ్చని జగన్ లెక్కలు వేసుకుంటున్నారని చెబుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ పార్టీలో మరో వర్గం లెక్కల ప్రకారం మాత్రం రాయుడును వైజాగ్ ఎంపీగా పోటీ చేయించాలని కూడా పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారట.
ఈసారి టీడీపీ-జనసేన పొత్తు దెబ్బ..
విశాఖపట్నం నుంచి రాయుడు లాంటి సెలబ్రెటీని బరిలోకి దింపితే పార్టీకి ప్రయోజనం ఉంటుందని యోచిస్తున్నారట. వైజాగ్‌లో పాగా వేయడానికి జగన్ తొలి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందుకే 2014లో ఏకంగా తన తల్లి విజయమ్మను ఎంపీగా పోటీ చేయించారు. కానీ ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. 2019లో మాత్రం స్వల్ప మెజార్టీతో ఎంపీ సీటు దక్కించుకోగలిగారు. అయితే అంత ఊపులో కూడా సిటీలోని నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీ గెలవలేకపోయింది. అంతేకాకుండా జనసేన నుంచి లక్ష్మీనారాయణ పోటీచేయడం.. ఆయనకు దాదాపు 3లక్షల ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్థి భరత్ కేవలం 2,875 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి టీడీపీ-జనసేన కలిసి ఎన్నికల బరిలో దిగుతున్నాయి కాబట్టి ఈ సీటు టీడీపీ గెలవడం నల్లేరు మీద నడకే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
రాయుడు పోటీ చేస్తే నెగ్గుకురావొచ్చని ప్లాన్..
అయితే వైఎస్సార్సీపీ అధినేత ఆలోచన మరో లాగా ఉందట. విశాఖ పార్లమెంట్‌లో కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. భీమిలి, గాజువాకతో పాటు సిటీలోని కొన్ని ప్రాంతాల్లో కాపు ఓట్లు భారీగా ఉన్నాయి. అదే వర్గానికి చెందిన రాయుడు పోటీ చేస్తే కచ్చితంగా సానుకూలత ఉంటుందని అలాగే ఇక్కడ సెటిల్ అయిన ఉత్తరాది ప్రజల ఓట్లు కూడా కీలకం కానున్నాయి. అందుకే క్రికెటర్‌గా దేశమంతా పరిచయం ఉన్న రాయుడు అయితే వాళ్ల ఓట్లు కూడా సాధించొచ్చనే ప్రణాళికలు రచిస్తున్నారట. ఇందుకు రాయుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి క్రికెటర్‌గా సుదీర్ఘంగా రాణించలేకపోయిన రాయుడు రాజకీయాల్లో అయినా రాణిస్తారో లేదో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com