ట్విట్టర్ వేదికగా అంబటి వర్సెస్ జనసేన వార్..
- IndiaGlitz, [Tuesday,August 18 2020]
ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకి జనసేన కార్యకర్తలకు మధ్య తీవ్ర స్థాయిలో వార్ నడుస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అంబటి చేసిన ఓ ట్వీట్ ఇంత రచ్చకు కారణమైంది. జనసైనికులు తీవ్ర స్థాయిలో రెచ్చిపోయి అంబటిని వరుస కామెంట్లతో ఉక్కిరి బిక్కిర చేస్తున్నారు. దీంతో అంబటి డిఫెన్స్‌లో పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా ఆగకుండా మరో ట్వీట్ పెట్టడంతో ఇంక అగ్గిలో మరింత ఆజ్యం పోసినట్టైంది.
ముందుగా అంబటి రాంబాబు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిపక్ష నేతల ‘‘స్వాతంత్ర దినోత్సవ వేడుకలను స్వరాష్ట్రంలో జరుపుకోలేని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడే అర్హత ఉందంటారా ?’’ అని ట్వీట్ చేశారు. ఇక అంతే 2015లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ హైదరాబాద్‌లో జెండా ఎగురవేసిన ఫోటోలను పోస్ట్ చేసి మరీ ఓ రేంజ్లో ఎదురుదాడికి దిగారు. ‘చుట్టం లాగా నియోజకవర్గానికి వచ్చిపోయే మీకు సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రజాసమస్యలపై పోరాటం చేసే ఐడియాలజీ ఉందా?’ అని ఒకరు.. ‘స్వతంత్ర దినోత్సవం అనేది దేశానికి సంబంధించినది. దేశం లో ఎక్కడ ఉన్నా పరదేశం లో ఉన్న జరుపు కోవచ్చు. ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా ఎమ్మెల్యే ఎలా అయ్యారు అంబటి గారు? ఊరికే ఎవరొకరి మీద పడిపోవడం తప్ప’ అని మరొకరు ఇలా కామెంట్లతో అంబటిని టార్గెట్ చేశారు.
అయినా అంబటి తగ్గలేదు.. ‘‘నా ట్వీట్‌కి జనసైనికులు భారిగా స్పందించారు. గౌరవంగా, లాజిక్‌తో కూడిన స్పందన చాలా తక్కువ మందిలో చూశాను. అసహనం, అసభ్య పదజాలంతో స్పందించిన వారి సంఖ్యే చాలా ఎక్కువ ఈ సంఖ్య ఎక్కువగా ఉన్నంతకాలం, జనసేనను భగవంతుడే కాపాడలి!’’ అని మరో ట్వీట్ చేశారు. దీంతో జనసేన కార్యకర్తల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ‘అసెంబ్లీలో, శాసన సభలో అసభ్య పదజాలంతో తిట్టుకునే మీ ఇరు పార్టీ నాయకుల కంటే బెటరే సార్ మా వాళ్ళు. అయినా లాజిక్‌తో కూడిన ట్వీట్స్ వేసామని మీరే ఒప్పుకున్నారు అంటే మీ ఆలోచనతో వేసిన ట్వీట్ చెత్త ట్వీట్ అని ఒప్పుకున్నట్టేగా!’ అని ఒకరు.. ‘మేము మీ కార్యకర్తలు లాగా హైకోర్టును అసభ్య పదజాలంతో దూషించి చివరికి కోర్టుచే నోటీసులు పొందలేదు రాంబాబు గారూ!’ అని మరొకరు పోస్టులు పెట్టడమే కాకుండా.. గతంలో అసెంబ్లీలో వైసీపీ నేతలు అసభ్యంగా మాట్లాడిన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.