సురేష్ బాబు కు ఝలక్ ఇచ్చిన అమెజాన్
- IndiaGlitz, [Friday,January 17 2020]
ఓటీటీలతో తస్మాత్ జాగ్రత్త.. అంటూ సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత సురేశ్ బాబు హెచ్చరించిన విషయం తెలిసిందే. నిర్మాణ విలువలతో పాటు.. వ్యాపార విలువలు బాగా తెలిసిన వ్యక్తి కావడంతో.. సురేశ్ బాబు మాటలపై అప్పట్లో అందరూ దృష్టి సారించారు.
అయితే ఆ మాటలన్న కొద్దిరోజులకే ఆయన ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. తన సంస్థలో నిర్మించిన ‘వెంకీ మామ’ హక్కులను ఆ సంస్థకు అమ్మి.. హాట్ టాపిక్ అయ్యారు. ఏ సంస్థలతో అయితే జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారో్.. ఇప్పుడదే సంస్థ ఆయనకు ఝలక్ ఇచ్చింది.
వివరాల్లోకెళ్తే.. వెంకీమామ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్‌కు విక్రయించిన సురేశ్‌బాబు.. సినిమా విడుదలైన 50 రోజుల తర్వాతే స్ట్రీమింగ్ చేయాలనే కండీషన్ పెట్టారట. రెండు సంస్థల మధ్య దానికి సంబంధించిన ఒప్పందం కూడా కుదిరిందట. అంతా బాగానే ఉంది కదా అనుకుంటున్న సమయంలో.. విడుదలైన 30 రోజులకే స్ట్రీమింగ్‌లో పెట్టి షాకిచ్చింది అమెజాన్. జనవరి 12న 'వెంకీమామ' స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. దీంతో ఇది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. జాగ్రత్తగా వ్యవహారాలు నడిపే.. సురేశ్ బాబు ఎలా పప్పులో కాలేశారా అన్న చర్చ జరుగుతోంది. దీనిపై ఆయన పెదవి విప్పే వరకు అసలు విషయం బయటపడదన్న టాక్ నడుస్తోంది.