Bigg Boss 7 Telugu : శివాజీ, ప్రశాంత్‌లను ఆడుకున్న ఇంటి సభ్యులు.. అమర్‌దీప్ ఉగ్రరూపం, దెబ్బకు దారికొచ్చారుగా
- IndiaGlitz, [Tuesday,September 12 2023]
బిగ్‌బాస్ 7 తెలుగులో తొలి ఎలిమినేషన్ జరిగిన సంగతి తెలిసిందే. కిరణ్ రాథోడ్‌ను గత వారం ఎలిమినేట్ చేశారు. దీంతో ఆవిడ ఫ్రెండ్ షకీలా బాగా ఎమోషనల్ అయ్యింది. మళ్లీ సోమవారం కావడంతో ఈ వారం నామినేషన్స్ మరింత వేడిగా జరిగాయి. కంటెస్టెంట్‌ని టబ్‌లోకి పిలిచి , వారిని నామినేట్ చేయాలనుకున్న ఇతర కంటెస్టెంట్స్‌ని పిలిచి వారిపై బురద నీళ్లు పడేలా చేయాలి. అలాగే పవర్ అస్త్ర సంపాదించిన ఆట సందీప్‌కు బిగ్‌బాస్ ఒక ఆఫర్ ఇచ్చాడు. నేరుగా ఒక కంటెస్టెంట్‌ని నామినేట్ చేసే పవర్ సందీప్ చేతికి వచ్చింది. ప్రిన్స్ డైరెక్ట్‌గా నామినేట్ అయినందున అతడిని ఇంకెవరు నామినేట్ చేయకూడదని బిగ్‌బాస్ కండీషన్ పెట్టాడు. టేస్టీ తేజని శుభశ్రీ , ప్రశాంత్ , రతిక నామినేట్ చేశారు. శివాజీని అమర్‌దీప్, ప్రియాంక, షకీలా , శోభాశెట్టి, దామిని నామినేట్ చేయడం గమనార్హం. తర్వాత ప్రశాంత్‌ని గౌతమ్, అమర్‌దీప్, షకీలా, తేజ, దామిని, ప్రియాంక నామినేట్ చేశారు.
ఇవాళ హౌస్‌లో శివాజీని, పల్లవి ప్రశాంత్‌ని అంతా ఒక ఆట ఆడుకున్నారు. ఇంటి సభ్యుల్లో తానే డామినేటింగ్ అన్నట్లుగా ప్రవర్తిస్తున్న శివాజీ తీరు చాలా మందికి నచ్చడం లేదు. ఈ కారణంతోనే ఆయనను నామినేట్ చేసేందుకు ఇంటి సభ్యులు ఎగబడ్డారు. ప్రశాంత్‌ను పొగుడుతూ తమని తక్కువ చేసేలా మాట్లాడుతున్నారని శివాజీపై అమర్‌దీప్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చెప్పేది ఆయన పట్టించుకోవడం లేదని ప్రియాం, శోభాశెట్టి ఫైర్ అయ్యారు. అంతేకాదు.. నామినేషన్స్ తంతు ముగిసి బయటకు వచ్చాక ప్రియాంక అయితే కన్నీళ్లు పెట్టుకుంది.
ఇక పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేసే సమయంలో అమర్‌దీప్ చౌదరి ఉగ్రరూపం ప్రదర్శించాడు. ఈ సమయంలో అతను లేవనెత్తిన పాయింట్స్, మాట్లాడిన మాటలకు కంటెస్టెంట్స్‌తో పాటు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇంటి పనుల్లో ఎక్కువగా కనిపించాలని సూచించాడు. నీలో రెండు ఫేస్‌లు వున్నాయని సీరియస్ అయ్యాడు. తాను ఇంతగా గొంతు చించుకుంటుంటే ప్రశాంత్ తీరు అమర్‌దీప్‌కు నచ్చలేదు. ముందు షోల్డర్ కిందకు దించు అంటూ బెదిరించినట్లుగా మాట్లాడాదు.
తామంతా నిజమైన ప్రశాంత్‌ను చూడాలనుకుంటున్నామని చెప్పాడు. తాను నీకంటే పెద్ద నటుడిని అని.. నువ్వు వెధవ అయితే తాను పరమ వెధవని అంటూ కౌంటర్ ఇచ్చాడు. మాట్లాడితే రైతుబిడ్డ అంటావు.. కానీ బీటెక్ కష్టాలు తెలుసా అని అమర్‌దీప్ చెప్పిన పాయింట్లకు సందీప్, రతిక ఫిదా అయ్యారు. అయితే తనకు చదువుకున్న వాళ్ల కష్టాలు తెలుసునని ప్రశాంత్ కౌంటరిచ్చే ప్రయత్నం చేశాడు. తాను కూడా డిగ్రీ వరకు చదువుకున్నానని.. ఎవరి కిందా పనిచేయడం ఇష్టం లేక పొలం పనులు చేస్తున్నట్లు ప్రశాంత్ వివరించాడు. చివరికి నీలాగా ఉండు, ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వు, సెంటిమెంట్ వాడొద్దు అని అమర్‌దీప్ సూచించాడు. మొత్తం మీద ఇవాళ సగం మాత్రమే నామినేషన్స్ పూర్తయ్యాయి. మిగతావి మంగళవారం జరగనున్నాయి.