‘అమరావతి’ షిప్ట్ కానుందా.. అసలేం జరుగుతోంది!?
- IndiaGlitz, [Tuesday,August 20 2019]
నవ్యాంధ్ర రాజధాని అమరావతి కాదా..? అమరావతి కాకుండా మరో చోటికి రాజధానిని మార్చేస్తారా..? అందుకే మొదట్నుంచి సీఎం వైఎస్ జగన్ అమరావతిని లైట్ తీసుకున్నారా..? తాజాగా మంత్రి బొత్స చేసిన సంచలన వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేంటి..? అసలు రాజధాని గురించి జనాలకు ఏపీ సర్కార్ ఏం చెబుతోంది..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఇంతకీ బొత్స ఏమన్నారు..!?
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంపై ప్రభుత్వంలో చర్చ జరుగుతుంది. అమరావతిలో ఫ్లైఓవర్లు, భారీ కట్టడాలు నిర్మించాల్సి ఉంది. అయితే ఇటీవల అమరావతిలో సంభవించిన వరదల్లో ముంపునకు గురయ్యే ప్రాంతాలు ఎక్కువని తేలాయి. దీనివల్ల ఇతర ప్రాంతాలతో పోల్చితే అమరావతిలో నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుంది. వేరే ప్రాంతాల్లో అయితే నిర్మాణం ఖర్చు తగ్గుతుంది అని బొత్స చెప్పుకొచ్చారు.
మొత్తానికి చూస్తే.. బొత్స మాటలను కాస్త లోతుగా వెళ్లి ఆలోచిస్తే అమరావతిని షిప్ట్ చేయడం పక్కా అని తెలుస్తోంది. వాస్తవానికి గత ప్రభుత్వం కూడా రాజధాని నిర్మాణంలో తాత్కాలిక భవనాలు తప్ప తాత్కాలికంగా కట్టిందేమీ లేదు. అందుకే ఏపీ క్యాపిటల్‌ను షిప్ట్ చేసినా పెద్దగా ఇబ్బందులేమీ తలెత్తవని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు సాధ్యం..? ఒకవేళ ఇదే నిజంగా జరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది..? అనేది తెలియాలంటే కొన్నిరోజులు వేచి చూడాల్సిందే మరి.