50 ఏళ్ల పాటు నిరాటంకంగా వెలుగులు... నేడు ఆరనున్న అమర జవాన్ జ్యోతి, కారణమిదే
Send us your feedback to audioarticles@vaarta.com
దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద అమర జవానులకు చిహ్నాంగా దాదాపు 50 ఏళ్లుగా ఏకధాటిగా వెలుగుతున్న ‘అమర జవాన్ జ్యోతి’ లేదా ‘ఎటర్నల్ ఫ్లేమ్’ శుక్రవారంతో చరిత్రలో కలిసిపోనుంది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ యుద్ధ స్మారకం (NWM)లో దీనిని విలీనం చేయనున్నారు. ‘శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు రెండు జ్వాలలను కలిపే మహోన్నత కార్యక్రమం జరగనుంది. అమర్ జవాన్ జ్యోతిలోని కొంత భాగాన్ని జాతీయ యుద్ధ స్మారకానికి తీసుకువెళ్లనున్నారు.
మొదటి ప్రపంచ యుద్దంలో అమరులైన 84,000 మంది భారత సైనికుల స్మారకార్ధం అప్పటి బ్రిటిష్ పాలకులు.. ఢిల్లీలో ఇండియా గేట్‌ను నిర్మించింది. అనంతరం 1971లో బంగ్లా విమోచన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికుల గౌరవార్ధం నాటి ఇందిరా గాంధీ ప్రభుత్వం అమర జవాన్ జ్యోతిని నిర్మించింది. నాటి నుంచి 50 ఏళ్లుగా అమర జవాన్ జ్యోతి నిరాటంకంగా వెలుగుతోంది. రిపబ్లిక్ డే, స్వాతంత్ర దినోత్సవం వంటి ముఖ్యమైన సందర్భాలలో సైనికులకు ప్రధాని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి వంటి ప్రముఖులు ఇక్కడ నివాళలర్పిస్తుంటారు.
అయితే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్ల కిందట జాతీయ యుద్ధ స్మారకాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 2019లో మోడీ దీనిని ప్రారంభించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి దేశం కోసం ప్రాణాలర్పించిన 25,942 మంది సైనికుల పేర్లను ఈ స్మారకంపై లిఖించారు. ఈ క్రమంలో రెండు స్మారకాల నిర్వహణ కష్టంగా మారడంతో అమర జవాన్ జ్యోతిని, జాతీయ యుద్ధ స్మారకంలో విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది.
అయితే, అమర జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారకంలో విలీనం చేయడం పట్ల మిశ్రమ స్పందన వస్తోంది. కొందరికీ మన సైనికుల దేశభక్తి, త్యాగ నిరతి ఎన్నటికీ అర్ధం కావని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అమర జవాన్ జ్యోతిని మళ్లీ వెలిగిస్తామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. మరోవైపు విపక్షాల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అమర జవాన్ జ్యోతి గురించి అసత్య ప్రచారం జరుగుతోందని... తాము జ్యోతిని ఆర్పివేయట్లేదని, అందులోని కొంత భాగాన్ని జాతీయ యుద్ధ స్మారక జ్యోతితో కలుపుతున్నామని తెలిపింది. ఇండియా గేట్ వద్ద ఉన్న ఈ స్మారకంపై 1971లో అమరులైన జవాన్ల పేర్లు లేవని... అయినప్పటికీ ఇక్కడ జ్యోతి వెలుగుతూ ఉండటం వారికి నివాళి అనిపించుకోదని వ్యాఖ్యానించింది. అదే సమయంలో జాతీయ యుద్ధ స్మారకం వద్ద 1971 యుద్ధంలో అమరులతో పాటు అనేక మంది వీర జవాన్ల పేర్లను లిఖించారని కేంద్రం గుర్తుచేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout