రైతులకు అమల అక్కినేని సాయం
- IndiaGlitz, [Saturday,June 13 2020]
అమల అక్కినేని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా బ్లూ క్రాస్ సంస్థకు హైదరాబాద్‌లో అమల అక్కినేని కో ఫౌండర్‌గా వ్యవహరిస్తుంటారు. అలాగే మరికొన్ని ఎన్‌జీఓలతోకలిసి పలు సేవలను అందిస్తుంటారు. తాజాగా ఈమె సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలనుకునే రైతులకు అండగా నిలబడటానికి ముందుకు వచ్చారు. వివరాల్లోకెళ్లే.. రంగారెడ్డి జిల్లా కేశం పేట మండలం పాపిరెడ్డి గూడ ప్రాంతంలోని 650 మంది రైతులకు అమల సాయం అందించారు. ఒక్కొక్క రైతుకు నాలుగు కిలోల కంది విత్తనాలను సరఫరా చేశారు. అంతే కాకుండా ఇంకా రైతులు సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపితే నిపుణులను అక్కడికి పిలిచిపించి ఎలాంటి పద్ధతుల్లో సేంద్రీయ వ్యవసాయం చేయాలనే దానిపై శిక్షణ కూడా ఇప్పిస్తానని తెలిపారు. అంతే కాకుండా ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా ప్రభావం నుండి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె వారికి సూచనలు చేశారు.
ఇక సినిమాల విషయానికి వస్తే అమల అక్కినేని చాలా పరిమితంగానే సినిమాల్లో నటిస్తున్నారు. తెలుగులో మనం సినిమాలో చిన్న పాత్రలో నటించిన అమల తర్వాత హిందీలో హమారీ అదూరి కహానీ, కార్వాన్ చిత్రాల్లో నటించారు. కన్నడలోనూ నటిస్తున్నారు. అలాగే హై ప్రీస్ట్ అనే వెబ్ సిరీస్‌లోనూ నటించారు.