Download App

Alludu Adhurs Review

యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ అంటే ఎవరికైనా టక్కున గుర్తుకొచ్చే పేరు 'అల్లుడు శీను'. ఈ సినిమా తర్వాత ఈ హీరో చేసిన సినిమాలు 'స్పీడున్నోడు, సాక్ష్యం, కవచం' ఏవీ సక్సెస్‌ను అందించలేదు. అయితే రొటీన్‌కు కమర్షియల్‌ ఫార్ములాకు భిన్నంగా చేసిన సినిమా 'రాక్షసుడు'తో హిట్‌ అందుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్‌. ఆ తర్వాత చేసిన 'సీత' కూడా ఈ హీరోకు పెద్దగా కలిసి రాలేదు. మరో హిట్‌ అవసరం అని అనుకుంటున్న తరుణంలో తనకు తొలి సినిమాకు కలిసొచ్చిన అల్లుడు పేరు కలిసొచ్చేలా 'అల్లుడు అదుర్స్‌' అనే టైటిల్‌తో సినిమా చేశాడు. కోవిడ్‌ నేపథ్యంలో షూటింగ్స్ ఆగిపోవడం, థియేటర్స్ మూత పడటంతో 'అల్లుడు అదుర్స్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బెల్లకొండ సాయి శ్రీనివాస్‌. మరి ఈ అల్లుడు టైటిల్‌ సెంటిమెంట్‌ ఈయనకు ఏ మేరకు కలిసొచ్చింది?  కోవిడ్‌ ప్రభావ సమయంలో రియల్‌ హీరోగా మారిన సోనూసూద్‌ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా కథేంటో చూద్దాం.

కథ:

చలాకీ కుర్రాడు శ్రీను(బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌) చిన్నప్పుడు..అంటే తొమ్మిదో తరగతి నుండి వసుంధర(అను ఇమ్మాన్యుయేల్‌)ను ప్రేమిస్తాడు.తన ప్రేమను ఓ రోజు వసుంధరకు చెబుతాడు శ్రీను. కానీ ఆమె మాత్రం శ్రీనుకి నో చెప్పేయడంతో పాటు అనుకోని పరిస్థితుల్లో శ్రీనుకి ఆమె దూరం అవుతుంది. అప్పటి నుండి ప్రేమకు దూరంగా ఉంటాడు. కానీ ఇంకా పెద్దవాడైన తర్వాత కౌముది(నభా నటేశ్‌)ను చూసి ప్రేమిస్తాడు. అదే సమయంలో శ్రీను లైఫ్‌లోకి గజ(సోనూసూద్‌) ఎంట్రీ ఇస్తాడు. తన ప్రేమను గెలిపించుకోవడానికి కౌముది తండ్రి జైపాల్‌ రెడ్డి(ప్రకాశ్‌ రాజ్‌)తో శ్రీను ఓ ఛాలెంజ్‌ చేస్తాడు. ఇంతకీ ఆ ఛాలెంజ్‌ ఏంటి?  అసలు శ్రీనుకి, గజకి ఉన్న గొడవేంటి? చివరకు శ్రీను ప్రేమలో ఎలా సక్సెస్‌ అయ్యాడు? అనే సంగతులు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

నటీనటుల విషయానికి వస్తే..నటుడిగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ యాక్టర్‌గా ప్రతి సినిమాకు బెటర్‌ అవుతున్నాడు. ఈ సినిమాలో తన పాత్రను చక్కగా క్యారీ చేశాడు. అయితే  ఇంకా బెటర్‌గా చేసుండొచ్చు అనిపించింది. కమర్షియల్‌ సినిమా కాబట్టి కొత్త కథను ఆశించడం తప్పే అవుతుందనే తరహాలో శ్రీనువైట్ల తరహా ఫార్మేట్‌లో కథను అలా ఇలా మార్చి ఓ కథను తయారు చేసుకుని చేసిన సినిమా. వన్‌మ్యాన్‌ షోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సినిమాను లాగే ప్రయత్నం చేశాడు. డాన్సులు, ఫైట్స్ విషయంలో ఎప్పటిలాగే తన స్పీడు చూపించాడీ హీరో. నభా నటేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ వారి వారి పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. ముఖ్యంగా నభా నటేశ్‌ ఇది వరకు సినిమాల కన్నా ఈ సినిమాలో ఎక్కువ గ్లామర్‌గా కనిపించిందనాలి. ప్రకాశ్‌రాజ్‌, హీరోయిన్‌ తండ్రి పాత్రను చేయడం కొత్తేమీ కాదు. సునాయసంగా ఆయన పాత్రలో ఒదిగిపోయారంతే. ఇక రియల్‌ హీరో సోనూసూద్‌.. ఈ సినిమా విషయంలో మాత్రం నార్మల్‌ విలన్‌ని చేసేశారు. ఇలాంటి పాత్రలను చేయడం తనకీ కొత్త కాదు కాబట్టి చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఇక శ్రీనివాసరెడ్డి, వెన్నెలకిషోర్‌, బ్రహ్మాజీ వంటి పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవి.

సాంకేతికంగా చూస్తే.. సంతోష్‌ శ్రీనివాస్‌ తన కమర్షియల్‌ ఫార్ములాలోనే సినిమా చేశాడు. కమర్షియల్‌ ఫార్ములాలో సినిమా చేయడం తప్పేమీ కాదు. అయితే డిఫరెంట్‌గా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ప్రేక్షకుడికి బోర్‌ కొట్టేస్తుంది. ఈ విషయాన్ని సంతోష్‌ శ్రీనివాస్‌ గుర్తు పెట్టుకోలేదు. లేకపోతే కమర్షియల్‌ ఫార్ములాలో నాకొచ్చిందింతే అనే స్టైల్లో సినిమాను తెరకెక్కించినట్లు కనిపించింది. ఇంటర్వెల్‌ వరకు ఫైట్స్‌, నాలుగు కామెడీసీన్స్‌తో నడిచిన సినిమా ఇంటర్వెల్‌ బ్యాంగ్‌లో ఓ టర్న్‌ తీసుకుంటుంది. అక్కడ నుండి హీరో తన ప్రేమ కోసం అందరినీమోసం చేస్తుంటాడు. అందరూ అది నమ్ముతుంటారు. ఫార్మేట్ అయితే ఇంతే. కామెడీ కోసం చాలా పాత్రలను తీసుకున్నారు. ట్రాక్‌లు కూడా చాలానే రాసుకున్నారు. అయితే ఇలాంటి కామెడీని జనరేట్‌ చేయడం ఇది వరకు ప్రేక్షకులు చూసేసిందే. చేసిందే మేం మ‌ళ్లీ మ‌ళ్లీ చేస్తాం మీరు చూడాల్సిందే అన్న‌ట్లుగా ఈ సినిమాను తెర‌కెక్కించిన‌ట్లు క‌నిపించింది. హీరోయిన్, హీరోని చూసి చిరాకు ప‌డుతుంటుంది. అలాంటి ఆమెకు హీరోపై ఎందుకు ప్రేమ పుడుతుందా అనేది స‌రైన రీజ‌న్స్ ఎలివేట్ చేయ‌లేదు. పోనీ కమ‌ర్షియ‌ల్ సినిమా క‌దా, లాజిక్కులు వెతుక్కోకూడ‌దు అని అనుకుందాం అనుకుంటే.. కామెడీ ప‌రంగా సినిమా చూసి ఎంజాయ్ చేశామ‌నుకునేలా ఉండాలి. సినిమాలో అది కూడా లేదు. సోనూసూద్‌, ప్ర‌కాశ్ రాజ్ పాత్ర‌ల‌ను మ‌రీ కామెడీ కింద మార్చేశారేంట‌బ్బా అనిపిస్తుంది. సినిమాలో ఆర్టిస్టుల లిస్టు పెద్ద‌దిగానే ఉన్నా, ఎవ‌రినీ అనుకున్న రీతిలో వాడుకున్న‌ట్లు క‌నిపించ‌లేదు. ఇక సినిమా కోసం నిర్మాత పెట్టిన ఖర్చుని ఛోటా కె.నాయుడు ఇంకా ఎలివేట్‌ చేస్తూ చక్కగా చూపించాడు. దేవిశ్రీ సంగీతం ఓకే.. కొడుతున్నా మీరు వినండి అనేలానే ఉంది. సాధార‌ణంగా కొన్ని సినిమాల‌కు దేవిశ్రీ మ్యూజిక్ ఎసెట్ అవుతుంది. ఈ సినిమాకు డీఎస్‌పీ సంగీతం ఎసెట్ కాలేదు.. స‌రిక‌దా, మ్యూజిక్ మ‌న‌దేవియేనా అనేలా ఉంది.  అయితే ఆహా, ఓహో అనే రేంజ్‌లో మాత్రం లేదనే చెప్పాలి. నిర్మాణ విలువలు బావున్నాయి.

చివరగా.. అల్లుడు అదుర్స్‌.. ప‌క్కా బెదుర్స్‌

Rating : 1.8 / 5.0