అల్లు అరవింద్‌ని ఆ వయసులో చెంపదెబ్బ కొట్టిన అల్లు రామలింగయ్య.. ఏం జరిగింది..?
Send us your feedback to audioarticles@vaarta.com
సాధారణంగా ప్రతి తల్లీదండ్రులు తమ పిల్లలను గాడిలో పెట్టేందుకు , తప్పు చేస్తే దండించేందుకు చేయి చేసుకోవడం అనేది ఎప్పటి నుంచో వస్తున్నదే. అలా కొట్టేది వారి క్షేమం కోసమే. మొదట్లో తమను కొడుతున్నారని పిల్లలు బాధపడినా.. వయసు పెరిగిన తర్వాత అవి తీపిగుర్తులుగా నిలిచిపోతాయి. అలా తన తల్లి లేదా తండ్రి కొట్టబట్టే ఈరోజు తాము సన్మార్గంలో వున్నామని అప్పుడు వారికి అర్థమవుతోంది. అయితే చిన్నప్పుడు ప్రతి ఒక్కరూ దెబ్బలు తినాల్సిందే. కానీ పెళ్లయి, వారి పిల్లలకు పెళ్లీడు వచ్చిన తర్వాత కూడా తండ్రి చేతిలో దెబ్బలు తింటే. వినడానికే విచిత్రంగా వుంది కాదు. ఇలా కూడా జరుగుతుందో అనిపిస్తుందా. కానీ ఒకరి విషయంలో ఇది జరిగింది. ఆయన ఎవరో కాదు.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. ఆయన తండ్రి ప్రఖ్యాత నటుడు అల్లు రామలింగయ్య లాగి పెట్టి కొట్టారట.. అది కూడా అల్లు అరవింద్‌కి 47 ఏళ్ల వయసున్నప్పుడు.
పెళ్లయి , పిల్లలు పుట్టిన తర్వాత అరవింద్‌కి తండ్రి చేతిలో సన్మానం:
అలీ హోస్ట్‌గా... ఈటీవీలో ప్రసారమవుతోన్న అలీతో సరదాగా కార్యక్రమానికి గెస్ట్‌గా అల్లు అరవింద్ వచ్చారు. రెండు భాగాలుగా ప్రసారమైన ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికరమైన విషయాలను ఆయన పంచుకున్నారు. ఈ సందర్భంగా తండ్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు అల్లు అరవింద్. మాటల సందర్భంలో ‘‘పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత మీకు సన్మానం జరిగిందని విన్నాను ’’ అని ఏ సందర్భంలో సార్ అంటూ అలీ ప్రశ్నిస్తాడు. దీనికి అల్లు అరవింద్ కూడా నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.
ఎవడ్రా నీకు డ్రైవింగ్ నేర్పిన వెధవ:
ఓ రోజున మా అమ్మగారితో ఆయన ఏదో విషయంలో తగవు పడుతున్నాడని.. ఈ క్రమంలో అమ్మ ఇంటర్‌కామ్‌లో నన్ను కిందకి రమ్మని పిలిచారని అరవింద్ చెప్పారు. నేను కిందకి వెళ్లగా.. మీ నాన్న నాతో గొడవపడి చెప్పులు కూడా వేసుకోకుండా రోడ్డు నడుచుకుంటూ వెళ్లిపోతున్నారని చెప్పిందని.. దీంతో తాను వెంటనే కారు తీసుకుని ఆయన వెనకాలే వెళ్లి బతిమలాడి కారు ఎక్కించుకుని తీసుకొచ్చానని.. కానీ గేటు దాటి కారు లోపలికి వెళ్తుండగా అప్పటికే కోపంతో ఊగిపోతున్న తాను బ్రేక్ గట్టిగా తొక్కేశానని అరవింద్ తెలిపారు. అంతే నాన్నగారు విండ్ షీల్డ్‌కి కొట్టుకోబోయారని.. వెంటనే లాగిపెట్టి చెంపపై ఒక్కటి కొట్టి.. ఎవడ్రా నీకు డ్రైవింగ్ నేర్పిన వెధవ అని తిట్టారని, కానీ ఆయనే తనకు డ్రైవింగ్ నేర్పారని (మరిచిపోయారని) అల్లు అరవింద్ చెప్పారు.
మా ఆవిడ చూడలేదనుకున్నా:
అయితే నాన్న గారు కొట్టిన తర్వాత కిందకి , పైకి చూశానని ఎవరూ లేరని అనుకుని.. హమ్మయ్య మా ఆవిడ చూడలేదు కదా అనుకున్నానని చెప్పారు. అప్పటికే కోపంతో రగిలిపోతున్నా.. కానీ దీనిని ఇష్యూ చేస్తే ఈ వయసులోనూ దెబ్బలు తిన్నాడనే తక్కువ అభిప్రాయం వుంటుందని సైలెంట్ అయ్యానని అరవింద్ తెలిపారు. రాత్రికి అమ్మానాన్నల గొడవ సద్దుమణిగిన తర్వాత బెడ్‌రూమ్‌లోకి వెళ్లానని.. అప్పుడు నిర్మల.. ఏవండి ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను అడుగుదామని, ఎందుకు మిమ్మల్ని మావయ్యగారు అలా కొట్టారు అని ప్రశ్నించిందని ఆయన తెలిపారు. నువ్వెప్పుడు చూశావు అని నేను అడగ్గా.. అప్పుడు నేను పైన వరండాలో వున్నానని.. మిమ్మల్ని కొట్టగానే లోపలికి పారిపోయానని ఆవిడ చెప్పిందని గుర్తుచేసుకున్నారు (నవ్వులు). అయితే అప్పుడు తనకు కొట్టాడని బాధ కలిగినా.. తర్వాత ఈరోజుకీ దానిని తలచుకుంటే ఎంతో ఆనందంగా వుంటుందని అల్లు అరవింద్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments