వీకెండ్ బాక్సాఫీస్ రిపోర్ట్ : ఫుల్ స్వింగ్‌లో పుష్ప.. తెలంగాణలో సరికొత్త రికార్డ్

  • IndiaGlitz, [Tuesday,December 21 2021]

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా అంచనాలను మించి అదరగొడుతోంది. తెలుగు రాష్ట్రాలు, కేరళలో వసూళ్ల దుమ్ము దులుపుతోంది. ఇప్పటికే 100 కోట్ల మార్కును క్రాస్ చేసిన పుష్ప.. మూడో రోజు కూడా మంచి వసూళ్లను సాధించింది. నైజాం ఏరియాలో రూ.23 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. అటు అమెరికాలోనూ పుష్ప మంచి కలెక్షన్లు సాధించింది. అక్కడ ఎన్నారైల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని చిత్ర యూనిట్ చెప్పింది. కేవలం మూడు రోజుల్లోనే 1.5 మిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుంది.

తెలంగాణలో ఐదు షోలకు పర్మిషన్ ఇవ్వడం, టికెట్ల రేట్ల పెంపు కారణంగా ఈ స్థాయిలో వసూళ్లు రావడానికి దోహదపడ్డాయి. అల్లు అర్జున్ సైతం తన ఊర మాస్ లుక్‌లో ఆకట్టుకుంటూ.. ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడంలో సక్సెస్ అయ్యాడు. ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్, ఓ మోస్తరు రివ్యూలు వచ్చినప్పటికీ ‘‘పుష్పరాజ్’’ వారంతంలో అందుకున్నాడు. ఈ మూవీ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఏరియాలోని థియేటర్స్‌లో మూడు రోజుల్లోనే కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసింది.

ఇక.. పుష్పలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటించారు. అనసూయ, సునీల్, ధనుంజయ్, రావు రమేశ్ కీలకపాత్రలు పోషించారు. మైత్రి మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియాలు సంయుక్తంగా నిర్మించాయి. అలాగే సమంత చేసిన ‘‘ఊ అంటావా మావ ... ఊఊ అంటావా’’ అంటూ సాగే ఐటెం సాంగ్‌కు మాస్ జనాలు ఊగిపోతున్నారు. చంద్రబోస్‌ ఈ పాటని రాయగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. గణేష్ ఆచార్య డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించగా... ఇంద్రావతి చౌహాన్‌ ఆలపించారు.