Allu Arjun's Uncle:కాంగ్రెస్ పార్టీలోకి అల్లు అర్జున్ మామ.. ఎంపీగా పోటీ..?

  • IndiaGlitz, [Friday,February 16 2024]

పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి బోల్తాపడిన గులాబీ పార్టీకి.. లోక్‌సభ ఎన్నికల్లోనూ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న ఇన్నాళ్లు పార్టీని అంటిపెట్టుకున్న నేతలు.. ఇప్పుడు కారు దిగేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన ఆయన పార్టీలో చేరికపై చర్చించారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ స్థానం నుండి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారట. ఇందుకు అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కంచర్ల చేరిక తమకు కూడా ఫ్లస్ అవుతుందని.. ఎంపీ ఎన్నికల్లో ఆయన అల్లుడు అల్లు అర్జున్ ఇమేజ్‌ను పార్టీకి ఉపయోగపడుతోందని లెక్కలు వేసుకున్నారట. అయితే మల్కాజ్‌గిరి ఎంపీ సీటు కోసం చాలా మంది కాంగ్రెస్ నేతలు కూడా పోటీ పడుతున్నారు. నిర్మాత బండ్ల గణేశ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావు, అంజనీకుమార్ యాదవ్ వంటి టికెట్ రేసులో ఉన్నారు. మరి టికెట్ ఎవరిని వరిస్తుందో చూడాలి.

ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ 2014 కంటే ముందు తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లుగా తెలిపారు. తాను విద్యాభ్యాసం చేసే సమయంలో కాంగ్రెస్ యూత్ విభాగంలో పనిచేసినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రావటం సొంత గూటికి వచ్చినట్లుగా ఉందని వెల్లడించారు. కాగా 2014 ఎన్నికలకు ముందు ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో కారు గుర్తుపై ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికలకు దూరంగా ఉన్నారు.

గతేడాది జరిగిన ఎన్నికల్లో నాగార్జున సాగర్ నుంచి పోటీ చేయాలని భావించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవటంతో పాటు నియోజవర్గంలో విస్తృతంగా పర్యటించారు. అల్లుడు బన్నీ చేత ఫంక్షన్ హాల్ కూడా ప్రారంభించారు. అయితే కేసీఆర్ సిట్టింగ్‌ ఎమ్మెల్యే నోముల భరత్‌కే అవకాశం ఇవ్వడంతో ఆయనకు అవకాశం దక్కలేదు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి ఎంపీగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.

మరోవైపు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతా రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వీరంతా హస్తం కండువా కప్పుకోనున్నారు. పట్నం సునీత చేవెళ్ల ఎంపీ సీటు ఆశిస్తుండగా.. బొంతు రామ్మోహన్, శ్రీలత.. సికింద్రాబాద్ ఎంపీ సీటు అడుగుతున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు మరికొంత మంది గులాబీ నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.