‘ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్’ : తగ్గేదే.. లే
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప'. బన్నీ, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడవ చిత్రంగా ‘పుష్ప’ తెరకెక్కుతోంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో బన్నీ నటిస్తున్నాడు. స్టైలిష్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా పుష్పరాజ్ పాత్రకు సంబంధించిన టీజర్‌ను 'ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్ ' పేరుతో చిత్ర యూనిట్ విడుదల చేసింది.
శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో 'పుష్ప' సినిమా తెరకెక్కుతోంది. 'ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్ ' టీజర్‌లో శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసేవారిని పట్టుకోవడానికి పోలీసులు వస్తుంటారు. వారి నుంచి తప్పించుకోవడానికి విజిల్స్ ద్వారా సంజ్ఞలు ఇచ్చుకుంటూ ఎలా తప్పించుకుంటారనేదాన్ని ప్రముఖంగా చూపించారు. పుష్పరాజ్ లుక్‌ను సైతం పరిచయం చేశారు. అలాగే గొర్రెలు, మేకలు మధ్యలో ఎర్ర చందనం దుంగలను కొంత మంది తరలించే సన్నివేశాన్ని కూడా టీజర్‌లో చూపించారు. అలాగే పోలీసులకు భయపడి ఎర్ర చందనం దుంగలను తీసుకెళ్లే కూలీలు భయపడి పారిపోవడం.. వంటి సన్నివేశాలను చూపించారు. ఇక రష్మికను కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సుబ్రహ్మణ్యస్వామికి కావడి తీసుకెళ్లే భక్తురాలిగా రష్మిక ఆకట్టుకుంది.
ఇక భారీ లారీ యాక్షన్ చేజింగ్ సీన్‌తో పాటు.. అల్లు అర్జున్‌ను పట్టుకునేందుకు వెంటాడే సీన్‌ను కూడా టీజర్‌లో చూడొచ్చు. ముసుగులో.. చేతులు కట్టేసి ఉన్న పుష్ప రాజ్‌ను కొందరు వెంబడిస్తూ ఉండటం.. వారి నుంచి తప్పించుకోవడమే కాదు.. వారిని మట్టు బెట్టే సీన్స్‌ను కూడా ఈ టీజర్‌లో సుక్కు చూపించారు. మంచి యాక్షన్ సీన్స్‌తో పాటు చిత్తూరు యాసలో 'తగ్గేదే..లే" అని బన్నీ చెప్పే సింగిల్ డైలాగ్‌తో టీజర్‌ను లేపేసినప్పటికీ.. యాక్షన్ సన్నివేశాలతో ఆసక్తికరంగా కట్ చేశారు. టీజర్‌ను చూసిన తరువాత సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయనడంలో సందేహం లేదు. ఆగస్ట్ 13న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments