అల్లు అర్జున్ మూవీ ఎఫెక్ట్.. కవలలు ఏం చేశారో చూడండి!
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, హన్సిక నటీనటులుగా వచ్చిన చిత్రం ‘దేశముదురు’. అప్పట్లో ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఈ మూవీతో హన్సికకు తెలుగులో మంచి క్రేజ్ దక్కింది. మరీ ముఖ్యంగా.. మూవీలో సన్యాసిగా ఉన్న హన్సికను.. ప్రేమలోకి దింపి దక్కించుకున్న విధానాన్ని చాలా చక్కగా దర్శకుడు తెరకెక్కించాడు. ఈ సినిమా నాటికి నేటికీ టీవీల్లో.. యూ ట్యూబ్‌లో ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తిగా తిలకిస్తుంటారు. అయితే.. అలా సినిమా చూసిన ఓ ఇద్దరు బాలికలు ఏకంగా సన్యాసిగా మారిపోవాలని భావించి రైలెక్కి వెళ్లిపోయారు. ఇంతకీ వాళ్లెందుకు ఇలా అవ్వాల్సి వచ్చింది..? ఎందుకు ఈ ప్రయత్నం చేశారు..? అనే ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మార్కులు తక్కువొచ్చాయని అడిగినందుకు..!
చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన విశ్వనాథ్ అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు (కవలలు). వారిద్దరూ ఇంటర్ చదువుతున్నారు. తిరుపతిలో చదువుకుంటున్న వీరిద్దరూ సంక్రాంతి సెలవులకై ఇంటికి వచ్చారు. అయితే సరిగ్గా చదవట్లేదని.. పరీక్షల్లో మార్కులు తక్కువస్తున్నాయని తల్లిదండ్రులిద్దరూ మందలించారు. ఇకపై బాగా చదువుకుంటామని.. మంచి మార్కులు సంపాదించుకుంటామని చెప్పాల్సిందిపోయి.. ఇంట్లో చెప్పుకుండా వెళ్లిపోయారు. ఉదయం వెళ్లిన పిల్లలూ ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కంగారు పడుతూ పోలీస్ స్టేషన్లో ఆ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరు బాలికల దగ్గరున్న ఫోన్ స్విచాఫ్ అని రావడంతో వారిలో మరింత ఆందోళనకు గురయ్యారు.
కంగుతిన్న పోలీసులు!
అయితే.. ఫోన్ స్విచాన్ అవ్వగానే అసలేం జరిగిందని పోలీసులు ఆరాతీయగా.. ఆ ఇద్దరు చెప్పిన సమాధానం విని పోలీసులు ఆశ్చర్యపోయారు. ‘కశ్మీర్ వెళ్లి సన్యాసినులుగా మారాలని భావిస్తున్నాం.. అందుకే ఇంట్లో చెప్పకుండా వచ్చేశాం’ అని పోలీసులకు బదులిచ్చారు. ఈ మాటలు విన్న పోలీసులు, బాలికల తల్లిదండ్రులు కంగుతిన్నారు. ఎట్టకేలకు వారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని చిత్తూరుకు తీసుకొచ్చి విచారణ చేయగా మరింత షాకయ్యే విషయాలు వెల్లడించారు. ‘‘దేశముదురు’ మూవీలో హీరోయిన్ మాదిరిగా సన్యాసినులుగా మారాలని భావించాం.. కశ్మీర్ వెళ్లాలని అనుకున్నాం. ఓ స్నేహితురాలు మాకు ఈ సలహా ఇచ్చింది’ అని ఆ ఇద్దరు బాలికలు చెప్పారు. దీంతో ఆ ఇద్దరు బాలికలకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు.. ఇకపై ఇలా చేయరాదని హెచ్చరించి ఇంటికి పంపారు.
ఓ కన్నేసి ఉంచండి!
చూశారా.. సినిమాల ప్రభావం జనాల మీద ఏ రేంజ్లో ఉంటుందో దీన్ని బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అందుకే సినిమాను సినిమాగానే చూసి.. అవసరమైంది మాత్రమే ఆచరించి.. అనవసరమైనది చూసి ఎక్కడిదక్కడ వదిలేయాలంతే..!. మరీ ముఖ్యంగా పిల్లలు అసలేం చేస్తున్నారు..? ఎలాంటి వారితో ఫ్రెండ్ షిప్ చేస్తున్నారు..? ఎలా చదువుతున్నారు..? అని తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలి లేకుంటే.. జరగాల్సిన నష్టం జరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com