Allu Arjun: విశాఖలో పుష్ప 2 షూటింగ్.. ఎయిర్‌పోర్ట్‌లో బన్నీకి ఘనస్వాగతం, లాంగ్ హెయిర్‌తో స్టైలిష్‌ లుక్‌లో ఐకాన్‌స్టార్

  • IndiaGlitz, [Friday,January 20 2023]

బాహుబలి సిరీస్ తర్వాత తెలుగు సినిమా ఖ్యాతిని మరో మెట్టు పైకెక్కించిన చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రం సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. దేశం మొత్తం పుష్ప పాటలు, డైలాగ్స్‌తో ఊగిపోయింది. ఈ మధ్యకాలంలో సమాజంపై ఈ స్థాయిలో ప్రభావం చూపిన సినిమా మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు తగ్గేదే లే అంటూ గడ్డం కింద చెయ్యి పెట్టి డైలాగ్ చెప్పారు. ఇది అల్లు అర్జున్‌కు తొలి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. తొలుత ఈ చిత్రాన్ని దక్షిణాది భాషల్లోనే రిలీజ్ చేయాలని భావించినప్పటికీ.. అనుకోకుండా హిందీలోనూ వదిలారు.

400 కోట్లు కొల్లగొట్టిన పుష్ప :

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 17, 2021న విడుదలైంది. పుష్పలో బన్నీ సరసన రష్మిక హీరోయిన్‌గా నటించారు. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రూ. 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.400 కోట్ల వసూళ్లు సాధించి అల్లు అర్జున్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇటీవలే ఈ సినిమాను రష్యాలోనూ డబ్ చేసి వదిలారు. పుష్ప 2 షూటింగ్‌కు తాజాగా చిత్ర యూనిట్ కొబ్బరి కాయ కొట్టిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం విదేశాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న పుష్ప 2కి సంబంధింది హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు.

పదిరోజుల పాటు విశాఖలో షూటింగ్ :

తాజా షెడ్యూల్ విశాఖలో జరుపుకోనుంది ఈ చిత్రం. దాదాపు పది రోజుల పాటు యూనిట్ మొత్తం అక్కడే వుండనుంది. దీనిలో భాగంగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు అల్లు అర్జున్. ఆయన రాక విషయం తెలుసుకున్న అభిమానులు చలిని కూడా లెక్క చేయకుండా ఎయిర్‌పోర్ట్‌కు తరలివచ్చి బన్నీకి ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ లుక్ ఆకట్టుకుంది. పొడవాటి జుట్టుని ముడి వేసి, బ్లాక్ డ్రెస్‌లో మరింత స్టైలిష్‌గా కనిపించారు ఐకాన్ స్టార్. ఇది పుష్ప 2 కోసమేనని తెలుస్తోంది. పుష్ప మొదటి భాగం ఘన విజయం సాధించిన నేపథ్యంలో.. సెకండ్ పార్ట్ కోసం టాలీవుడ్‌తో పాటు మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.