బన్నీ పాఠాలు
- IndiaGlitz, [Saturday,January 25 2020]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో సినిమా అనగానే అందరిలో ఓ ఆసక్తి నెలకొంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య, ఆర్య 2 చిత్రాలు ప్రేక్షకాదరణ పొందిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ ఓ హ్యాట్రిక్ మూవీ కోసం రెడీ అవుతున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ప్రతి డైరెక్టర్‌కి ఓ స్టైల్ ఉంటుంది. సుకుమార్ విషయానికి వస్తే రంగస్థలంలో రామ్‌చరణ్‌ని పక్కా మాస్ కోణంలో చూపించిన సుకుమార్ అలాంటి మరో రగ్డ్ లుక్‌లోనే బన్నీని కూడా చూపించాలని నిర్ణయించుకున్నాడు. ఇక బన్నీ కూడా సుకుమార్ సలహాలను ఫాలో అయిపోతున్నాడు. కొత్త చిత్రానికి సిద్ధమైపోతున్నాడు.
చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. అందుకని బన్నీని చిత్తూరు జిల్లా యాస నేర్చుకోమని సుకుమార్ సూచించాడు. ఇంకేం! బన్నీ కూడా చిత్తూరు జిల్లా యాసతో తన గొంతుకతో పలికించడానికి సిద్ధమైపోతున్నాడు. అందులో భాగంగా బన్నీ ఓ ట్రైనర్‌ను నియమించుకుని చిత్తూరు జిల్లా యాసను నేర్చుకుంటున్నాడని సినీ వర్గాల సమాచారం.
అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకున్న బన్నీ తదుపరి సినిమా.. అది కూడా సుకుమార్ దర్శకత్వంలో కాబట్టి సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. రంగస్థలం వంటి భారీ హిట్ తర్వాత సుకుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం కూడా ఇదే మరి!.