Allu Arjun:హేళనలనే సవాల్‌గా తీసుకుని.. బన్నీ ఐకాన్‌స్టార్‌గా ఎలా ఎదిగారంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లు అర్జున్.. ఇప్పుడు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్న పేరు. తెలుగు సినిమాకు కలగా నిలిచిన జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందుకున్న తొలి తెలుగు స్టార్‌గా ఆయన చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలో అభిమానులు, సినీ , రాజకీయ ప్రముఖులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. స్టైలీష్ స్టార్‌గా, ఐకాన్ స్టార్‌గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే బన్నీ గురించి ఆసక్తికర విశేషాలు చూస్తే:
మెగా ఫ్యామిలీలో రెండో తరం నటుడిగా ఎంట్రీ :
మెగా ఫ్యామిలీలో చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌ల తర్వాత వచ్చిన తర్వాతి తరం నటుడు అల్లు అర్జున్. మామయ్య చిరంజీవి తర్వాత డ్యాన్సుల్లో అంతటి ప్రతిభ గల నటుడిగా బన్నీ గుర్తింపు తెచ్చుకున్నారు. నటన, డైలాగ్ డెలీవరి, ఫైట్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి.. అప్పుడే 20 ఏళ్లు పూర్తయింది. ఇప్పుడు భారతదేశంలోని అత్యంత డిమాండ్ వున్న నటుల్లో ఒకరిగా బన్నీ నిలిచారు. ఇదంతా ఆయనకు రాత్రికి రాత్రే రాలేదు. దీని వెనుక ఎంతో కష్టం, కృషి, పట్టుదల వున్నాయి.
గంగోత్రి సమయంలో బన్నీ లుక్స్‌పై కామెంట్స్ :
స్వతహాగా సినీ కుటుంబం కావడం, ఇంట్లో అందరూ స్టార్సే వుండటంతో ఆ ప్రభావం అల్లు అర్జున్‌పై చిన్నతనంలోనే పడింది. 1985లో చిరంజీవి నటించిన విజేత, 1986లో కమల్‌హాసన్ స్వాతిముత్యంలలో బాలనటుడిగా కనిపించారు బన్నీ. దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘‘గంగోత్రి’’ సినిమా ద్వారా అల్లు అర్జున్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీలో నటనపరంగా ఓకే అనిపించుకున్నప్పటికీ.. విమర్శకులు కొన్ని వంకలు పెట్టారు. ఆయన లుక్స్‌పై పలువురు హేళన చేశారు. అయినప్పటికీ ఏమాత్రం నిరుత్సాహపడకుండా తన లోపాలను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ వచ్చారు బన్నీ. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలోనూ ఆయనకు భారీ అభిమాన గణం వుంది. అక్కడ ఆయనను మల్లు అర్జున్ అని ఫ్యాన్స్ పిలుచుకుంటారు.
బన్నీ సిక్స్‌ప్యాక్‌కి యువత ఫిదా :
టాలీవుడ్‌తో పాటు తెలుగు నాట సిక్స్ ప్యాక్ ట్రెండ్ తెచ్చింది అల్లు అర్జునే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన దేశముదురు సినిమాతో ఆయన తొలిసారిగా సిక్స్ ప్యాక్‌లో కనిపించారు. దీంతో యువత వెర్రెక్కీ పోయింది. వేలాది జిమ్స్ రెండు రాష్ట్రాల్లో పుట్టుకొచ్చాయి. సిక్స్ ప్యాక్ , స్పెషల్ ట్రైనర్స, స్పెషల్ డైట్స్ అంటూ ఎంతోమందికి ఉపాధి లభించింది. దక్షిణాదిలో చిరంజీవి తర్వాత అంతటి మేటి డ్యాన్సర్‌గా అల్లు అర్జున్ నిలిచారు. తొలి రోజుల్లో తాను నటించే ప్రతి సినిమాలోనూ ఒక స్పెషల్ స్టెప్ వుండేలా బన్నీ జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక కాస్ట్యూమ్స్, గాడ్జెట్స్ సంగతి సరేసరి. కెరీర్‌లో ఎంతో బిజీగా వున్నప్పటికీ కుటుంబానికి ఎంతో ప్రాధాన్యతనిస్తారు బన్నీ. తాతకు తగ్గ మనవడిగా, మంచి కొడుకుగా, మంచి భర్తగా, మంచి తండ్రిగా.. కోట్లాదిమంది అభిమానించే ఐకాన్ స్టార్‌గా నిలిచారు అల్లు అర్జున్.
పుష్పతో వసూళ్ల వేట:
సుకుమార్ , అల్లు అర్జున్ కాంబినేషన్ టాలీవుడ్‌లో తిరుగులేనిది. వీరిద్దరూ కెరీర్ తొలినాళ్లలోనే కలుసుకున్నారు. ఆర్య, ఆర్య 2, ఇప్పుడు పుష్పతో తమది హిట్ పెయిర్‌గా నిరూపించుకున్నారు. ఆర్య2 తర్వాత దాదాపు పదేళ్లకు బన్నీ-సుకుమార్ కాంబినేషన్‌లో మూవీ సెట్ అయ్యింది. అదే పుష్ప. 1980-90ల కాలంలో ఎర్రచందనం నేపథ్యంలో సాగే కథలో మొరటు లుక్‌లో కనిపించారు అల్లు అర్జున్. బాహుబలి సిరీస్ తర్వాత తెలుగు సినిమా ఖ్యాతిని మరో మెట్టు పైకెక్కించిన చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రం సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. దేశం మొత్తం పుష్ప పాటలు, డైలాగ్స్‌తో ఊగిపోయింది. ఈ మధ్యకాలంలో సమాజంపై ఈ స్థాయిలో ప్రభావం చూపిన సినిమా మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు తగ్గేదే లే అంటూ గడ్డం కింద చెయ్యి పెట్టి డైలాగ్ చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 17, 2021న విడుదలైంది. రూ. 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.400 కోట్ల వసూళ్లు సాధించి అల్లు అర్జున్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా బన్నీకి జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని తెచ్చిపెట్టింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments