అల్లు వారి రామాయణం
- IndiaGlitz, [Monday,July 08 2019]
వాల్మీకి రామాయణానికి ఆ తర్వాతి కాలంలో చాలా వెర్షన్లు వచ్చాయి. వీడియో రూపంలోనూ రామాయణగాథలు అలరించాయి. వాటిలో కొన్ని సీరియళ్ల రూపంలో వస్తే, మరొకొన్ని పిల్లల కోసం కార్టూన్ నెట్ వర్కుల్లో యానిమేషన్ల రూపంలో వచ్చాయి. కొన్ని పాత్రలనే ప్రత్యేకంగా తీసుకుని జై హనుమాన్లాంటి సీరీస్లూ వచ్చిన సంగతి తెలిసిందే. వెండితెరమీద ఎన్నో ఏళ్లుగా తనదైన ముద్ర వేసుకున్న గీతా ఆర్ట్స్ కూడా ఇప్పుడు రామాయణం తీయాలని అనుకుంటోంది. ఈ విషయమై ఇటీవల అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా సమావేశమైనట్టు సమాచారం.
హిందీలో 'దంగల్' తెరకెక్కించిన నితీష్ తివారి, 'మామ్'ను రూపొందించిన రవి ఉడయార్ ఈ తాజా చిత్రానికి మెగాఫోన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలుగు, తమిళ్, హిందీలో మూడు పార్టులుగా త్రీడీ టెక్నాలజీతో తెరకెక్కించాలన్నది ప్లాన్ అట. అయితే నటీనటులు ఎవరు నటిస్తారు? ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది? ప్రీ ప్రొడక్షన్ పూర్తయింది? ఇప్పుడు ఆలోచన స్థాయిలోనే ఉందా? వంటి వివరాలు తెలియాల్సి ఉంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ మీడియాతో పంచుకోవడానికి ఎప్పుడూ సుముఖంగా ఉండే అల్లు అరవింద్ ఈ విషయం ఓ కొలిక్కి రాగానే బయటపెడుతారని కూడా ఫిల్మ్ నగర్ సమాచారం.