'తేజ్ ఐలవ్ యు' చాలా పెద్ద హిట్ అవుతుంది - అల్లు అరవింద్
Send us your feedback to audioarticles@vaarta.com
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు నిర్మించిన చిత్రం 'తేజ్'..'ఐ లవ్ యు' అనేది ఉపశీర్షిక. ఈ సినిమా జూలై 6న విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా.... సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ - "20 ఏళ్లుగా కరుణాకరన్‌గారు లవ్ మేజిషియన్‌గా ఉండి.. ప్రేమకథా చిత్రాలే చేస్తూ మమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూ వచ్చారు. మాకెన్నో బ్యూటీఫుల్ మూవీస్ ఇచ్చారు. నా కెరీర్‌లో ఓ ఇంపార్టెంట్ మూవీని కరుణాకరన్‌గారు డైరెక్ట్ చేస్తే కె.ఎస్.రామారావుగారు నిర్మించారు. ఇదొక బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియెన్స్. ప్రతి రోజూ ఎంజాయ్ చేస్తూ సినిమా చేశాను. మాకు సపోర్ట్ ఇచ్చిన కె.ఎస్.రామారావుగారు థాంక్స్. ఆయన మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. డెఫనెట్‌గా సినిమా అందరికీ నచ్చుతుంది" అన్నారు.
చిత్ర నిర్మాత కె.ఎస్.రామారావు మాట్లాడుతూ - "నేను రేడియో సిటీలో పబ్లిసిటీ చేస్తున్న సమయంలో రేడియో రామారావుగా, అందరికీ పరిచయం ఉండేది. ఆ సమయంలో గొప్ప నిర్మాతలైన అశ్వనీదత్, అల్లు అరవింద్‌గారితో పరిచయం ఉండేది. అంత గొప్ప నిర్మాతల స్థాయి కాకకపోయినా వారితో ఈ వేదిక పంచుకునే స్థాయి రావడం నా అదృష్టం.
నా కంపెనీలో సినిమాలు చేసిన దర్శకులు, హీరోల వల్లనే నేను ఈ గొప్ప స్థితికి వచ్చాను. అశ్వనీదత్‌గారి సినిమాలను చూసి ఇంత గ్రాండ్‌గా సినిమాలు ఎలా చేస్తారో? అనుకుంటూ రేడియో పబ్లిసిటీ చేస్తూ ఆయనతో ట్రావెల్ చేశాను. మా కంటే చిన్నవాడైన అశ్వనీదత్‌గారు పెద్ద హీరోలైన ఎన్టీఆర్‌గారితో సినిమాలు చేశారు. ఆయన చేసే సినిమాల స్థాయి చూసి మేం అశ్చర్యపోయే వాళ్లం. ఆయన సినిమాలను అబ్జర్వ్ చేస్తూ కొంత నేర్చుకున్నాను.
అలాగే అరవింద్ గారి ప్లానింగ్ చాలా గొప్పగా ఉంటుంది. ఎక్కడా దుబారా కాకుండా సినిమాలు చేస్తారు. అలా ఆయన సినిమాలను అబ్జర్వ్ చేయడం జరిగింది. అరవింద్‌గారు ఇంత సీనియర్.. ఇప్పుడు సోల్జర్స్‌లాంటి నిర్మాతలను తయారు చేస్తున్నారు. ఆయన పెద్ద సైన్యాన్ని తయారు చేసుకుంటూ వస్తున్నారు.
చిరంజీవిగారు చాలా గొప్పగా నిలదొక్కుకున్నారంటే ఫౌండేషన్ ప్లాన్ చేసిన వ్యక్తి అరవింద్‌గారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుండి 11 హీరోలున్నారు. కానీ అందరూ క్రమశిక్షణతో ఉన్నారంటే కారణం అరవింద్‌గారి ప్లానింగే. అరవింద్‌గారు మాకెవరికీ అంతుపట్టని ప్లానింగ్ చేస్తారు.
ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం సాయిధరమ్ తేజ్. సినిమా చాలా బాగా వచ్చింది. కరుణాకరన్‌గారు సినిమా చేయడమే కాదు.. మ్యూజిక్ విషయంలో కూడా దగ్గరుండి కేర్ తీసుకున్నాడు. మా సినిమాకు పనిచేసిన డార్లింగ్ స్వామి, గోపీసుందర్, అండ్రూ అందరికీ థాంక్స్" అన్నారు.
ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ - "నేను చిరంజీవిగారితో కలిసి ముందుగా సినిమాలు నిర్మించినా.. కె.ఎస్.రామారావుగారు జర్నీ కూడా చిరంజీవిగారితో వెంటనే ప్రారంభం అయ్యింది. చిరంజీవిగారితో నేను తీసుకురాలేని ఇళయరాజాగారిని అందరినీ తీసుకొచ్చి సినిమాలు చేసి వరుసగా హిట్స్ కొట్టేసరికి రామారావుగారంటే చిన్న ఈర్ష్య ఉండేది. ఆయనతో సినిమాలు తీయడంలో పోటీ పడేవాడిని. రామారావుగారి గురించి మరో విషయం చెప్పాలి. ఈ మధ్య ఆయన సినిమాలు రెండు, మూడు సరిగ్గా ఆడలేదు.
ఆయన్ను ఓ సందర్భంలో కలిసి 'ఏంటి? అంతా సవ్యంగానే ఉంది కదా?' అని అంటే.. 'బాస్ లాభమా నష్టమా? అని ఆలోచించను. నా దగ్గర ఆఖరి రూపాయి ఉన్నంత వరకు సినిమాల్లోనే పెడతాను.. సినిమాల్లోనే ఉంటా.. సినిమాల్లోనే చనిపోతా` అన్నారు. ఆయన మాట విని నా గుండె ఝల్లుమంది. నేను సినిమాల్లో కమర్షియల్‌గానే ఉంటా.. రామారావుగారి ప్యాషన్ చూసి నేను ఇంత ప్యాషన్‌గా ఉన్నానా? అనిపించింది. అలాంటి ప్యాషన్‌ను మళ్ళీ అశ్వనీదత్‌గారిలోనే చూడాలి.
ఆయనకు సినిమాలంటే ఓ పిచ్చి.. వెర్రి. ఇలా సినిమాలను ప్రేమిస్తున్న స్నేహితులు ఉండటం నా అదృష్టం. ఇక దర్శకుడు కరుణాకరన్ గురించి చెప్పాలంటే తను తొలిప్రేమ సినిమా చేసిన తర్వాత కరుణాకరన్‌ని కలిసి చిరంజీవిగారు, పవన్‌కల్యాణ్‌లతో నా నిర్మాణంలో నువ్వే సినిమా చేయాలని కూడా అన్నాను. `సార్.. ఇప్పుడు సినిమా షూటింగ్ చేస్తున్నాను.. మీరు అలా అనేసి వెళ్లిపోతే నా బుర్ర పాడైపోతుంది` అన్నారు. కానీ ఆ సినిమా చేయలేదనుకోండి. కానీ వారిద్దరితో ఎప్పటికైనా నేను సినిమా చేస్తాననే అనుకుంటున్నాను. మా ఫ్యామిలీకి, కరుణాకర్‌కి మంచి అనుబంధం ఉంది.
అందరి హీరోలతో తను సినిమాలు చేశాడు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే తేజ్ సినిమా ట్రైలర్ చూశాను. చాలా బావుంది. సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది. తేజు మంచి ఆర్టిస్టే కాదు.. మంచి వ్యక్తి కూడా. హీరోగా ఎదగడానికి, వాళ్ల అమ్మ కళ్లలో ఆనందం చూడటానికి తను పడ్డ కష్టమేంటో నాకు తెలుసు. చాలా మంచి భవిష్యత్ ఉన్న హీరో.
దశాబ్దాలు కొనసాగేంత డేడికేషన్ ఉన్న హీరో. తన నటించి గత రెండు, మూడు చిత్రాలు కూడా పెద్దగా ఆడలేదు. `అదేంట్రా` అని అడిగితే.. `అది పోద్ది మావయ్య ..నాకు తెలుసు. కానీ మాటిచ్చాను... చేస్తాను` అని కమిట్ మెంట్ కోసం తన కెరీర్‌ని కూడా లెక్కచేయని వ్యక్తి తేజు. అలాగే సినిమాలో నటించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు అభినందనలు" అన్నారు.
స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ మాట్లాడుతూ - "కె.ఎస్.రామారావుగారు నన్ను చూసి ఇన్‌స్పైర్ అయ్యేవాడినని చెప్పాడు కానీ.. అది శుద్ధ అబద్ధం. ఎందుకంటే నేను మాంటిస్సోరి స్కూల్‌లో చదువుకునే రోజుల్లో రామారావుగారు కె.ఎస్.ప్రకాశ్‌రావుగారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసేవారు. మా సూర్యారావు పేటలో ఆరోజుల్లో రామారావుగారిని కలవడం అంటే పెద్ద గ్లామర్‌గా ఫీలయ్యేవాళ్లం. ఆయన్ను చూసి ఎంతో గర్వపడతాం. ఇవాళకి కూడా ఆయన సినిమాల్లో ఉన్నంత మ్యూజిక్ మన సినిమాల్లో లేదేమో అని ఫీల్ అవుతుంటాను. ఆయన్ను చూసి గర్వంగా ఫీల్ అవుతుంటాను. ఆయనతో సహా ఎంటైర్ యూనిట్‌కి ఆల్ ది బెస్ట్" అన్నారు.
ఎ.కరుణాకరన్ మాట్లాడుతూ - "తొలిప్రేమ నుండి ఈరోజు వరకు నేను చేసిన ఈ ప్రయాణంలో నా హీరోలు, నిర్మాతలు ఎంతగానో సపోర్ట్ చేశారు. వారు లేకుంటే నేను లేను. చాలా ఎమోషనల్‌గా ఉంది. తక్కువ సినిమాలే చేసినా.. పెద్ద పెద్ద నిర్మాతలతో పనిచేశాను. నేషనల్ అవార్డ్ తీసుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉందో.. ఇప్పుడు అంతే ఆనంద పడుతున్నాను" అన్నారు.
చాముండేశ్వరి నాథ్ మాట్లాడుతూ - "కె.ఎస్.రామారావుగారు నాకు ముప్పై ఏళ్లుగా పరిచయం ఉంది. ఎంతగానో సపోర్ట్ చేశారు. తేజ్ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments