అర‌వింద్ రిక్వెస్ట్‌.. ప్ర‌భుత్వం ఒప్పుకుంటుందా?

కోవిడ్ 19 కార‌ణంగా ప్ర‌పంచం స్తంభించింది. ప‌లు రంగాలు చాలా న‌ష్టాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అలాంటి రంగాల్లో సినీ రంగం కూడా ఒక‌టి. లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన త‌ర్వాత థియేట‌ర్స్‌ను మూసివేశారు. షూటింగ్స్‌ను ఆపేశారు. దీంతో సినీ ప్ర‌ముఖులంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మైయ్యారు. ఇప్పుడు క్ర‌మంగా తెలంగాణ ప్ర‌భుత్వానికి పినీ ప్ర‌ముఖుల నుండి విన‌తులు వెల్లువెత్తుతున్నాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులకు, ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కు అనుమ‌తి ఇవ్వాలంటూ తమ్మారెడ్డి భ‌రద్వాజ వంటివారు ప్ర‌భుత్వాన్ని కోరారు.

ఈ క్ర‌మంలో తెలుగు అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన అల్లు అర‌వింద్ నుండి తెలంగాణ ప్ర‌భుత్వానికి ఓ విజ్ఞ‌ప్తి వెళ్లింద‌ట‌. అదేంటంటే.. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో అర‌వింద్ ఆహా అనే తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఓటీటీలో కంటెంట్‌ను పెంచాలంటే షూటింగ్స్ జ‌రుపుకోవాల్సి ఉంది. ముఖ్యంగా ఓటీటీ ఆడియెన్స్ నుండి కొత్త కంటెంట్ కావాల‌ని ప్రేక్ష‌కులు కోరుకుంటున్నార‌ని అందులో భాగంగా త‌ను మినీ వెబ్ సిరీస్‌ను నిర్మించాల‌నుకుంటున్నాన‌ని కాబ‌ట్టి 15-20 మంది స‌భ్యుల‌తో కూడిన యూనిట్‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని అర‌వింద్ కోరుతున్నార‌ట‌. మ‌రి అర‌వింద్ రిక్వెస్ట్‌ను ప్ర‌భుత్వం ఒప్పుకుంటుందో లేదో చూడాలి.