నిర్మాతగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారే నా ఆదర్శం: సురేశ్ కొండేటి
- IndiaGlitz, [Friday,October 06 2017]
చిత్రసీమలోకి వచ్చిన తర్వాత కూడా నాకు పుట్టిన రోజు (అక్టోబర్ 6వ తేదీ)ని వేడుకగా జరుపుకోవడం అలవాటు లేదు. అయితే ఓసారి మగధీర' ప్రెస్ మీట్ కు వెళ్ళినప్పుడు ఆ చిత్ర నిర్మాత శ్రీ అల్లు అరవింద్ గారికి ఆ వేళ నా బర్త్ డే అనే విషయం తెలిసి… వెంటనే కేక్ తెప్పించి, బర్త్ డే జరిపించారు. మా పాలకొల్లు వాసి, నాకు చిత్ర పరిశ్రమలో చేదోడు వాదోడుగా ఉంటే అల్లు అరవింద్ గారి ఆశీస్సులతో అప్పటి నుండి బర్త్ డే జరుపుకుంటున్నాను' అన్నారు యువ నిర్మాత సురేశ్ కొండేటి. అక్టోబర్ 6వ తేదీ ఆయన పాలకొల్లులో ఈసారి పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.
రెండు దశాబ్దాల క్రితం జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించి, కృష్ణాపత్రిక', వార్త' దిన ప్రతికలలో సినిమా జర్నలిస్ట్ గా విశేష అనుభవాన్ని సంపాదించుకున్న సురేశ్ కొండేటి ఆ తర్వాత సొంతగా సంతోషం' ప్రతికను ప్రారంభించారు. ఆ వెంటనే సంతోషం ఫిల్మ్ అవార్డులను అందించడం మొదలుపెట్టారు. ఇవాళ సౌత్ లోనే ఫిల్మ్ ఫేర్' తర్వాత మళ్ళీ అంతటి క్రేజ్ ఉన్నది సంతోషం అవార్డ్స్' కే అంటే అతిశయోక్తి కాదు. చిత్రసీమలోని ప్రతి ఒక్కరూ తనను సొంత మనిషిగా భావించి, అక్కున చేర్చుకోవడం వల్లే ఇది సాధ్యమైంద'ని సురేశ్ కొండేటి చెబుతారు. 75 చిత్రాలను పంపిణీచేసిన అనుభవం సురేశ్ కొండేటిది. ఆ అనుభవంతోనే ప్రేమిస్తే' చిత్రంతో నిర్మాతగా మారారు. తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. దాదాపు పదిహేను చిత్రలను తెలుగువారి ముందుకు తీసుకొచ్చిన సురేశ్ కొండేటి త్వరలోనే మలయాళ చిత్రం ఉస్తాద్ హోటల్'ను తెలుగులో జనతా హోటల్'గా విడుదల చేయబోతున్నారు. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన ఈ సినిమా ఇక్కడ కూడా ఘన విజయం సాధిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
చిత్రసీమలోని ప్రతి ఒక్కరికీ తలలో నాలుకగా వ్యవహరించే సురేశ్ కొండేటి కాలంతో పరుగులెత్తే వ్యక్తి. సంతోషం' పత్రికను క్రమం తప్పకుండా ప్రచురించడంతో పాటు చిత్రసీమలోని అనేక విభాగాలలో అన్నీ తానై వ్యహరిస్తుంటారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫిల్మ్ అవార్డ్స్ కమిటీ సభ్యునిగానూ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కల్చరల్ కమిటీ ఛైర్మన్ గా, ఎఫ్.ఎన్.సి.సి. పాలకమండలి సభ్యునిగా, ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కల్చరల్ కమిటీ ఛైర్మన్ గానూ విశేష సేవలు అందిస్తున్నారు. ఇవాళ చిత్రసీమలో అందరికీ తలలో నాలుకగా వ్యవహరించే సురేశ్ కొండేటి మెగా పి.ఆర్.ఓ.గా రాణిస్తున్నారు.
డబ్బింగ్ చిత్రాల నిర్మాతగా కెరీర్ ప్రారంభించి, మెగా ప్రొడ్యూసర్ గా ఎదిగిన అల్లు అరవింద్ గారి అడుగుజాడలలో సాగుతూ… త్వరలోనే స్ట్రయిట్ చిత్రాన్ని ప్రారంభించబోతున్నట్టు సురేశ్ కొండేటి పుట్టిన రోజు సందర్బంగా తెలిపారు. తన పుట్టిన రోజు నాడే జన్మించిన తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ కు సురేశ్ కొండేటి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.
కెరీర్ ప్రారంభంలో తనకు సంపూర్ణ సహకారం అందించిన అగ్ర కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ కు… ఆ తర్వాత అదే తరహాలో తనకు సపోర్ట్ గా నిలిచిన యువ కథానాయకులకు సురేశ్ కొండేటి ధన్యవాదాలు తెలిపారు. తన అభ్యున్నతికి కారకులైన చిత్రసీమలోని ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులకు సురేశ్ కొండేటి కృతజ్ఞతలు తెలియచేశారు.