Telangana Secretariat:తెలంగాణ కొత్త సచివాలయం ఓపెనింగ్.. ఫ్లోర్ల వారీగా శాఖల కేటాయింపు, కేసీఆర్ ఆఫీస్ ఎక్కడ..?
- IndiaGlitz, [Thursday,April 27 2023]
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నెల 30వ తేదీన సెక్రటేరియట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు. అంతేకాదు ఆ రోజున సుదర్శన యాగం నిర్వహించనున్నారు సీఎం. ఇప్పటికే అన్ని పనులు పూర్తి కావడంతో బీఆర్కే భవన్లో వున్న సామాగ్రి, కీలక దస్త్రాలను అధికారులు నూతన సచివాలయానికి తరలిస్తున్నారు. అంతేకాదు.. శాఖల వారీగా ఫ్లోర్ల కేటాయింపు కూడా పూర్తి చేసింది ప్రభుత్వం. ఒక్కో ఫ్లోర్‌కు మూడు శాఖలను కేటాయించింది సర్కార్.
ఏ ఫ్లోర్లో ఏ శాఖంటే:
గ్రౌండ్ ఫ్లోర్ : ఎస్సీ, మైనార్టీ, లేబర్, రెవెన్యూ శాఖలు
1వ అంతస్తు : ఎడ్యుకేషన్, పంచాయతీ రాజ్, హోంశాఖ
2వ అంతస్తు : ఫైనాన్స్, హెల్త్, ఎనర్జీ, పశు సంవర్థక శాఖ
3వ అంతస్తు : ఇండస్ట్రియల్ అండ్ కామర్స్, ఎస్సీ డిపార్ట్మెంట్, ప్లానింగ్ డిపార్ట్మెంట్
4వ అంతస్తు : బీసీ వెల్ఫేర్, ఫారెస్ట్, కల్చరల్ డిపార్ట్మెంట్, నీటి పారుదల శాఖ, లా డిపార్ట్ మెంట్
5వ అంతస్తు : టీఆర్ అండ్ బీ, సాధారణ పరిపాలన శాఖలు
6వ అంతస్తు : సీఎం, సీఎస్ కార్యాలయాలు
లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో సీఎం ఛాంబర్ :
తాజాగా కొత్త సచివాలయానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా సీఎం ఛాంబర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందట. ఆరో అంతస్తులో దాదాపు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో సీఎం కార్యాలయం ఏర్పాటు చేశారు. సీఎం పేషీ తలుపులపై సింహం ప్రతిమతో డిజైన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ జనహిత పేరిట కట్టిన హాల్‌తో పాటు 25 మంది మంత్రులు, 30 మందికి పైగా అధికారులు పాల్గొనేందుకు వీలుగా కేబినెట్ సమావేశ మందిరం, విశిష్ట అతిథులతో ముఖ్యమంత్రి భోజనం చేసేందుకు అత్యాధునిక డైనింగ్ హాల్ ఏర్పాటు చేశారు. అన్ని శాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించేందుకు సీఎం కాన్ఫరెన్స్ హాలును అత్యాధునిక వసతులతో నిర్మించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులకు సచివాలయం ప్రాంగణంలో 2.5 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏకకాలంలో 560 కార్లు, 720 ద్విచక్ర వాహనాలు, నాలుగు బస్సులను పార్క్ చేయవచ్చు. సందర్శకుల కోసం 1.5 ఎకరాల స్థలంలో మరో పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు.
శత్రు దుర్బేద్యంగా కొత్త సచివాలయం :
ఇక కొత్త సచివాలయాన్ని శత్రు దుర్భేద్యంగా నిర్మించారు. ఏం జరిగినా సరే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్ని విభాగాల భద్రతాధికారులకు సమాచారం చేరేలా ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రతినిత్యం 650 మంది భద్రతా సిబ్బంది కాపలా కాస్తారు. 24 గంటలూ పనిచేసే అత్యాధునిక సీసీటీవీ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఫేస్ రికగ్నిషన్ ద్వారా సందర్శకుల సమాచారం వారి ఆధార్ డేటాతో అనుసంధానమవుతుంది.