Chandrababu: బీజేపీతో పొత్తు కుదిరింది.. టీడీపీ నేతలతో చంద్రబాబు..
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ ఎన్డీఏలోకి చేరడం ఖాయమైపోయింది. అధికారిక ప్రకటన ఒక్కటే ఆలస్యమైంది. రెండు రోజులు పాటు ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేసిన చర్చలు విజయంతమయ్యాయి. దీంతో ఆరేళ్ల తర్వాత ఎన్డీఏలోకి టీడీపీ చేరుతోంది. తమ కూటమికి ఎందుకు ఓటు వేయాలో ప్రజలకు వివరిస్తామని నేతలు చెబుతున్నారు. ఢిల్లీ పర్యటన విజయవంతంగా ముగియడంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ హైదరాబాద్కు తిరుగుపయనమయ్యారు.
ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్లు, ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు బీజేపీతో పొత్తుపై కీలక ప్రకటన చేశారు. ‘మనం ఎన్డీఎలోకి వెళుతున్నాం.. సీట్ల సర్దుబాటు కూడా కుదిరింది. పొత్తులపై కూడా త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది. బీజేపీకి 6 అసెంబ్లీ, 5 లోక్సభ సీట్లు ఇచ్చాం. బీజేపీ, జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నాం. ఐదేళ్లలో ఏపీని జగన్ దివాళా తీయించారు. ఈ పరిస్థితుల్లో ఏపీకి కేంద్ర సహకారం చాలా అవసరం. ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకోవాలంటే కేంద్రంతో కలిసి ఉండాలి. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్, విభజన హామీలు నెరవేర్చడం, అరాచక పాలనను అంతమొందించడం కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాం. సోమవారం మిగతా అభ్యర్దుల జాబితా ప్రకటన ఉండొచ్చు. పార్టీలో టిక్కెట్లు రాని, అసంతృప్తిగా ఉన్న వారిని వెంటనే సీనియర్లు.. పిలిపించి మాట్లాడండి’ అని చంద్రబాబు తెలిపారు.
మరోవైపు బీజేపీతో పొత్తులు కుదిరాయని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కూడా తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్నారు. సీట్ల సంఖ్యపై ఏ క్షణమైనా అధికారిక ప్రకటన వస్తుందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నదే మూడు పార్టీల లక్ష్యమని స్పష్టంచేశారు. ఎన్డీఏలోకి టీడీపీని బీజేపీ ఆహ్వానించిందని ఈ నెల 14వ తేదిన జరిగే ఎన్డీఏ సమావేశానికి చంద్రబాబును హాజరుకావాల్సిందిగా అమిత్ షా కోరారని ఆయన వెల్లడించారు. మొత్తానికి పొత్తుల అంశం ఓ కొలిక్కిరావడంతో ఎన్నికల ప్రచారంపై కూటమి నేతలు ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments