సంచలనం: సుప్రీంకోర్టు సీజేపై లైంగిక ఆరోపణలు.. కక్ష గట్టిందెవరు!?
- IndiaGlitz, [Saturday,April 20 2019]
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. గోగొయ్ తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ 35 ఏళ్ల మహిళ శుక్రవారం ఫిర్యాదు చేసింది. 2018 అక్టోబర్ 10, 11 తేదీల్లో జస్టిస్ గొగోయ్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించి, వేధింపులకు గురిచేశారని ఆ మహిళ ఆరోపిస్తోంది.
ఆయన వేధింపులకు తిరస్కరించినందుకు తనను, తన కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేశారని, అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్‌గా పని చేసిన ఆమె 22మంది న్యాయమూర్తులకు సమర్పించిన అఫిడవిట్‌లో ఈ ఆరోపణలు చేశారు. ఈ మహిళ చేసిన ఆరోపణలతో ఒక్కసారిగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు షాకయ్యారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. అసలేం జరిగిందో తేల్చాలని సుప్రీం కోర్టు త్రిసభ్య బెంచ్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడమేగాక.. తక్షణమే సమావేశమైంది.
డబ్బుతో కొనలేక ఇలా చేశారా..!?
అయితే తనపై వచ్చిన ఆరోపణలపై రంజన్ ఎట్టకేలకు పెదవి విప్పారు. అసలేంటి ఇది..? నేను లైంగికంగా వేధించడమేంటి..? అంటూ ఆవేదన వ్యక్తం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.నమ్మశక్యంగా లేదు.. ఈ ఆరోపణలను ఖండిచేందుకు నేను మరీ దిగజారి మాట్లాడదల్చుకోలేదు. డబ్బు ఎరతో ఎవరూ నా దరిదాపుల్లోకి రాలేకపోయారు. అందుకే ఇలా వేరే మార్గాలు వెతికి.. చివరికి ఇలా చేశారు. ఇలాంటి ఆరోపణలతో మొత్తం న్యాయవ్యవస్థే ప్రమాదంలో పడింది. ఇలాగైతే మంచివాళ్ళెవరూ ఈ రంగంలోకి రారుఅని జస్టిస్ గొగోయ్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.
అంతా అబద్ధమేనా..!?
సుప్రీకోర్టు సెక్రటరీ జనరల్ స్పందిస్తూ మహిళలు ఆరోపణలు నిరాధారమన్నారు. మహిళకు నేర చరిత ఉందని ఆమెపై రెండు ఎఫ్ఆర్లు ఉన్నాయని తుషార్ మెహతా అన్నారు. నేరారోపణలు ఉన్న మహిళ సుప్రీంకోర్టు సర్వీసులోకి ఎలా వచ్చిందని మెహతా ప్రశ్నించారు. మొత్తానికి చూస్తే ఇదంతా అబద్ధమేనని.. కావాలనే కొందరు పనిగట్టుకుని.. కక్షగట్టి మరీ ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంతకీ దీని వెనుక ఉన్నదెవరో తేలాల్సి ఉందన్న మాట. కాగా.. మీడియా సంస్థలు ఇలాంటి వార్తల విషయంలో కాస్త సంయమనం పాటించాలని బెంచ్ పేర్కొంది. సో.. ఈ వ్యవహారం ఇంతటితో ఆగుతుందా..? లేకుంటే మరింత ముదురుతుందో వేచి చూడాల్సిందే మరి.