పాతికేళ్ళ 'అల్లరి ప్రియుడు'

  • IndiaGlitz, [Monday,March 05 2018]

తల్లిదండ్రులను దేవుడు ఇస్తాడు. కాని స్నేహితుణ్ణి మాత్రం మనల్నే ఎంచుకోమని దేవుడు మనకే వదిలేశాడు. ఎందుకంటే స్నేహితుడిగా మనకి ఎవరు కావాలో.. ఆ దేవుడికి కూడా తెలీదు. అటువంటి స్నేహానికి అర్థం చెప్పిన సినిమా అల్లరి ప్రియుడు'. డా. రాజశేఖర్, రమ్యకృష్ణ, మధుబాల, రావు గోపాలరావు, బ్రహ్మానందం, శుభ, రవితేజ, బాబుమోహన్ ప్రధాన పాత్రధారులుగా కె.రాఘవేంద్ర రావు తెర‌కెక్కించిన చిత్ర‌మిది. మార్చి 5, 1993న విడుదలై ఘన విజయం సాధించిన ఈ చిత్రం.. నేటితో 25 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఈ సంద‌ర్భంగా ఆ జ్ఞాప‌కాల‌లోకి వెళితే..

క‌థాంశం

క‌విత (మ‌ధుబాల‌), ల‌లిత (ర‌మ్య‌కృష్ణ‌)అనే ఇద్ద‌రు అమ్మాయిల స్నేహం చుట్టూ తిరిగే క‌థాంశంతో 'అల్ల‌రి ప్రియుడు' తెర‌కెక్కింది. కవిత తండ్రి ఒక క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌ కంపెనీ యజమాని. లలిత తండ్రి ఆ కంపెనీలో ఒక కార్మికుడు. ఒక రోజు కవితను కాపాడబోయి.. లలిత తండ్రి ప్రమాదంలో మరణిస్తాడు. అప్పటినుంచి లలిత బాగోగులు కవిత తల్లిదండ్రులు చూస్తుంటారు. ఇద్దరు అక్కాచెల్లెళ్ళు గానే పెరిగి పెద్దవుతారు. కవితకి వయోలిన్ అంటే పిచ్చి. కవిత పేరుతో పాటలను రాస్తుంటుంది లలిత. లలిత రాసే ఆ పాటలను పాడి రాజా (రాజ‌శేఖ‌ర్‌) అనే యువకుడు మంచి గాయకుడిగా పేరుతెచ్చుకుంటాడు. ఈ నేపథ్యంలో రాజా.. లలిత ఎలా ఉంటుందో తెలియ‌క‌పోయినా ఆమెని ఆరాధిస్తుంటాడు. ల‌లిత‌కి రాజా గురించి తెలిసినా.. కవిత కూడా రాజాను ప్రేమిస్తుంద‌ని తెలిసి తన ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధ పడుతుంది. కొంత కాలం త‌రువాత క‌విత‌కి కూడా అస‌లు విష‌యం తెలుస్తుంది. చివ‌ర‌కు ఏమైందన్నదే కథ.

బాలీవుడ్‌లో వచ్చిన సాజన్' (1991) సినిమాకి రివర్స్ ట్రీట్మెంట్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు రాఘవేంద్ర రావు. సాజన్'లాగే ఈ సినిమా కూడా పెద్ద మ్యూజికల్ హిట్. సందర్భోచితంగా మంచి సాహిత్యంతో ఉండే పాటలను.. తన సంగీతంతో మరో స్థాయికి తీసుకెళ్ళారు సంగీత దర్శకుడు కీరవాణి. వేటూరి, సిరివెన్నెల, భువనచంద్ర, కీరవాణి రాసిన పాటలను బాలు, చిత్ర ఆలపించారు. 1993కు గాను బెస్ట్ డైరెక్టర్‌గా రాఘవేంద్ర రావు, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కీరవాణి ఫిలింఫేర్ అవార్డుల‌తో పాటు నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. కన్నడంలో ఈ చిత్రాన్ని చోర చిత్త చోర' పేరుతో పునఃనిర్మించారు.